తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు రెసిపీ తయారీ విధానం
భారతీయ వంటకాలు

తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు రెసిపీ తయారీ విధానం

రోజూ ఒకే రకమైన వంట తిని బోరుకొడుతుందా...మీకు తెలియని కొత్త రెసిపీ ఏదైనా చేయాలనుకుంటున్నారా... అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ మీ కోసమే. ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే పచ్చి పులుసు రెసిపీ తక్కువ సమయంలో ఎలా తయారుచేయాలో, తయారీకి కావాల్సిన పదార్ధాలు ఏమిటో తెలుసుకుందాం. మీరూ నేర్చుకుని, ట్రై చేసి మీ ఇంట్లోవాళ్ళకి రుచి చూపించండి.

పచ్చి పులుసు తయారీకి కావలిసిన పదార్దాలు

  • పచ్చి మిర‌ప‌కాయ‌లు – రెండు
  • ఎండు మిర్చి - రెండు
  • చింత పండు – నాలుగు బొట్టలు
  • త‌రిగిన ఉల్లి పాయ‌లు – 2,
  • ఉప్పు – రుచికి స‌రిప‌డా
  • పసుపు - అర  స్పూన్
  • కారం - సరిపడా
  • క‌రివేపాకు – 2 రెబ్బ‌లు,
  • వెల్లుల్లి రెబ్బలు – ఆరు
  • నీళ్లు – లీటరు
  • కొత్తి మీర - రెండు రెమ్మలు
  • ఆవాలు - అర స్పూన్
  • జీలకర్ర - ఒక స్పూన్
  • శెనగపప్పు - అర  స్పూన్
  • మినపప్పు - అర స్పూన్
  • నూనె - ఒక స్పూన్

పచ్చి పులుసు తయారీ విధానం

ముందుగా చింత పండును గోరువెచ్చని నీళ్లలో పది హేను నిముషాలు నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తరవాత బాగా పిసికి రసం తీసుకోవాలి. చింతపండు రసం తీసుకున్నాక అందులో పులుసు మరియు పిలుపుకి సరిపడా నీళ్లు పోసుకోవాలి.

ఇప్పుడు అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, గుండగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొత్తిమీర తురుము వేసి చేతితో బాగా పిసికి ఓ పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

పులుసు రెడీ చేసుకున్నాక పోపు కోసం ఒక పాన్ తీసుకుని నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, వెల్లుల్లి, శెనగపప్పు, మినపప్పు, కరివేపాకు, పసుపు వేసి పోపు బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తరవాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న పులుసు వేసుకుని  వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రసం మరిగించకూడదు. అంతే టేస్టీగా ఎంతో సింపుల్ గా పచ్చి పులుసు రెడీ రెడీ అయినట్లే.

పచ్చి పులుసులో లభించే పోషకవిలువలు, ప్రయోజనాలు

పచ్చి పులుసు సాధారణంగా రుచికరమైన వంటకం. ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చింతపండు విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్ల సంవృద్ధిగా లభిస్తాయి.

చింతపండు పులుసు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి, జీర్ణక్రియను సులభతరం చేయడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు మీ చర్మాన్ని ఆరోగ్యంగా మార్చడానికి చింతపండులో శక్తివంతమైన సమ్మేళనాలు ఉన్నాయి.

ఇది తక్కువ కేలరీలు కలిగిన వంటకం. ఇది బరువు తగ్గటానికి లేదా ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడానికి ఉపయోగపడుతుంది. పచ్చి పులుసులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గించటంలో, అధిక రక్తపోటును నిర్వహించడంలో. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించటంలో అలాగే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించటంలో ఉపయోగపడుతుంది. మరియు ఐరన్ లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Post Comment