రాగి సంగటి : ఆరోగ్యానికి మేలు చేసే రాగి సంగటి తయారీ విధానం
భారతీయ వంటకాలు

రాగి సంగటి : ఆరోగ్యానికి మేలు చేసే రాగి సంగటి తయారీ విధానం

రాగుల వల్ల కలిగే ప్రయోజనాలు మనందరికీ తెలుసు. బరువు తగ్గడంలో, షుగర్ మరియు బీపి వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో రాగులు ఎంతోగానో ఉపయోగపడతాయి. రాగుల పిండితో అనేక రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. ఈ రోజు ఈ ఆర్టికల్ యందు రాగులతో చేసే రాగిసంగటి రెసిపీ తయారీ, కావాల్సిన పదార్ధాలు గూర్చి తెలుసుకుందాం.

రాగి సంగటి తయారీకి కావాల్సిన పదార్ధాలు

  • రైస్ - ఒక కప్పు
  • రాగి పిండి - ఒక కప్పు
  • ఉప్పు - సరిపడా
  • నీళ్లు - నాలుగు కప్పులు
  • నెయ్యి - 1/2 స్పూన్

రాగి సంగటి తయారీ విధానం

ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి పదిహేను నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. తరవాత బియ్యంలో ఆఫ్ స్పూన్ నెయ్యి, నాలుగు కప్పులు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి.

ఇప్పుడు ఒక కప్పు రాగి పిండిని కొద్దిగా నీటిలో ఉండలులేకుండా కలుపుకొని పెట్టుకోవాలి ( లేదంటే పొడి పిండి అన్నం ఉడుకుతుండగా కూడా వేసి కలుపుకోవచ్చు). అన్నం తొంబైశాతం ఉడికిన తరవాత, ఉడుకుతున్న బియ్యంలో కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని పోస్తూ ఉండలు లేకూండా మొత్తం కలిసేలా బాగా కలపాలి. ఇప్పుడు ఉప్పు సరిపడా వేసుకొని కొద్దిసేపు లో- ఫ్లేమ్ లో ఉడికించాలి.

ఉడికిన తరువాత మిశ్రమాన్ని చేతులకు తడి పెట్టుకుని ముద్దలుగా చేసుకోవాలి. అంతే రాగి సంగటి ముద్దలు రెడీ అయినట్లే. వీటిని ఏ కూరతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. రాగి సంగటికి మంచి కాంబినేషన్ కూర అంటే మాత్రం నాటుకోడి పులుసు, ఇది రాయలసీమ స్పెషల్ డిష్.

రాగి సంగటి తయారీకి కొన్ని చిట్కాలు

రాగిసంగటి కోసం రేషన్ బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం మెత్తగా ఉడికి ముద్ద చేయటానికి వీలుగా ఉంటుంది. అన్నం 3/4 వంతు ఉడికిన తరువాత పిండిని వేసి కలుపుకోండి. పిండిని అన్నంలో వేసాక కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలుగా అయిపోయి గట్టిపడుతుంది. రాగి ముద్దలు చేసేటపుడు చేతులకి నీళ్లు తడిపెట్టుకుంటే ముద్ద చేతులకు అంటుకోకుండా ఉంటుంది. రాగి ముద్దలను వేడి వేడిగా సర్వ్ చేయండి, చల్లారిన తర్వాత రాగి ముద్దలు గట్టిబడతాయి.

రాగి సంగటిలో పోషకాలు

రాగులలో పీచు ఎక్కువుగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రాగులలో కాల్షియం సంవృద్ధిగా వుండి ఎముకలు దృడంగా ఉండటంలో ఉపయోగపడతాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది, ఇది రక్తహీనతను నివారిస్తుంది.

Post Comment