ఆంధ్రా గోంగూర రొయ్యల ఇగురు తయారీ విధానం
భారతీయ వంటకాలు

ఆంధ్రా గోంగూర రొయ్యల ఇగురు తయారీ విధానం

గోంగూర కాంబినేషన్లో చేసే ప్రతీ రెసిపీకు ఒక ప్రత్యేకత ఉంటుంది. గోంగూర 'పచ్చడి, గోంగూర చట్నీ, గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర పప్పు ఇలా ఈ జాబితా చాలా పెద్దది. వీటిలో గోంగూర రొయ్యల ఇగురు కూర మరో లెవెల్. ఈ ఆర్టికల్ యందు ఈ ప్రత్యేక గోంగూర రొయ్యల కూరను ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.

గోంగూర రొయ్యల ఇగురు తయారీకి కావాల్సిన పదార్దాలు

  • గోంగూర - 2 కట్టలు
  • రొయ్యలు - 250 గ్రా.
  • ఉల్లిపాయలు - రెండు
  • టమాటో - రెండు
  • పచ్చి మిర్చి - 2
  • పసుపు - 1/2 టీ స్పూన్
  • కారం - ఒక టీ స్పూన్ (సరిపడా)
  • ఉప్పు - సరిపడా
  • నూనె - 4 నుంచి 6 స్పూన్స్
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • వెల్లులి రెబ్బలు - 6
  • ఆవాలు - 1/2 టీ స్పూన్
  • ఎండుమిర్చి - 2
  • జీలకర్ర - 1/2 టీ స్పూన్

గోంగూర రొయ్యల ఇగురు తయారీ విధానం

ముందుగా రొయ్యలు, అలాగే గోంగూర ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. స్టౌ ఆన్ చేసి కళాయిలో గోంగూర ఆకులు వేసి తక్కువ మంటపై మెత్తగా అయ్యేవరకు ఉడికించి పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో టమాటాలు, పచ్చిమిర్చిని దోరగా వేయించి మిక్సీ చేసి పేస్టులా చేసుకోండి.

తర్వాత స్టౌ మీద కళాయి పెట్టి అందులో నూనె వేసుకుని కొంచెం వేడి అయిన తర్వాత రొయ్యలు, కొంచెం పసుపు వేసి తక్కువ మంటపై దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అవసరం అయితే మరికొంచెం నూనె వేసుకుని ఎండు మిర్చి, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, వేసి ఒక నిమిషం పాటు వేగించాలి. అవి కొంచెం వేగినాక చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.

ఈ ప్రక్రియ పూర్తియ్యాక ఇదివరకు ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర, టమాటో పేస్ట్ జోడించాలి. వీటికి కాస్త పసుపు, కారం, రుచికి తగినంత ఉప్పు వేసి, మూత పెట్టుకుని తక్కువ మంటపై ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.

తర్వాత ఈ గోంగూర మిశ్రమంకు ముందుగా వేయించిన రొయ్యలు కలిపి ఒక పది నిముషాలు ఉడికించాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకోవాలి. అంతే రుచికరమైన, వేడి వేడిగా ఘుమఘుమలాడే గోంగూర రొయ్యల కూర రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది.

గోంగూర రొయ్యల కూర తయారీకి కొన్ని చిట్కాలు

గోంగూర రొయ్యల కూర తయారీకి తాజా గోంగూర ఆకులను, అలాగే తాజా రొయ్యలను ఉపయోగించడం ఉత్తమం. తాజావి ఉపయోగించడం వలన మనం చేసే వంటకం మరింత రుచికంగా వస్తుంది. అలానే గోంగూరను, రొయ్యలను మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా దోరగా వేయించుకోవాలి. ఎక్కువుగా వేయిస్తే గట్టిగా మారుతాయి. అదే తక్కువ వేయించడం వలన పచ్చి వాసన వస్తాయి.

గోంగూర రొయ్యల పులుసుకు మరింత అదనపు రుచిని జోడించేందుకు కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా పెరుగును కలపొచ్చు. కూరలో ఇగురు అవసరం అనుకుంటే సరిపడా నీళ్లు కలుపుకోండి.

గోంగూర పోషక విలువలు

గోంగూర వంటలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటుగా త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాలలో సర్వసాధారనం. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో గోంగూరతో కూడిన వంటలు ప్రతి ఇంటిలో కనిపిస్తాయి. గోంగూరను ఇండియాలో రెడ్ సోరెల్, అంబాడా, పిటా లేదా పులిచా కీరై అని పిలుస్తూ ఉంటారు. దీని ఇంగ్లీషులో రోసెల్లె ప్లాంట్ అని అంటారు. గోంగూర అన్ని ఆకుకూరలు మాదిరిగానే కంటి చూపును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

గోంగూర ఆకులు బరువు తగ్గడానికి సహాయపడతాయి. మన శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి మరియు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లలు, చర్మ వ్యాధుల చికిత్స చేయడానికి కూడా ఇవీ సహాయపడతాయి. వీటితో పాటుగా గోంగూర ఎన్నో సూక్ష్మ మూలకాలకు నిలయంగా ఉంది. ఇది బీ6, బీ9 వంటి బీ కాంప్లెక్స్ విటమిలకు మూలాధారమైన ఫోలిక్ ఆమ్లం (ఫోలాసిన్) కలిగి ఉంటుంది.

అలానే గోంగూరలో ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, జింక్ మరియు విటమిన్ ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అదేవిదంగా, రొయ్యలలో ముఖ్యంగా ప్రొటీన్, విటమిన్ డి, విటమిన్ బి3 సహా అనేక పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి.ఇతర మాంసాహారాలతో పోల్చుకుంటే రొయ్యల్లో ఉండే పోషకాలు చాలా ఎక్కువ.

Post Comment