నాటుకోడి కూర తయారీ విధానం : స్పైసీ ఆంధ్రా చికెన్ కర్రీ
తెలుగు సాహిత్యం భారతీయ వంటకాలు

నాటుకోడి కూర తయారీ విధానం : స్పైసీ ఆంధ్రా చికెన్ కర్రీ

నాటుకోడి కూరను తక్కువ సమయంలో చాలా సింపుల్ గా మరియు చాలా టేస్టీగా తయారుచేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా నాటుకోడి మరియు కొబ్బరికోరు కాంబినేషన్లో టేస్టీ టేస్టీగా నోరూరించే స్పైసీ నాటుకోడి కూరను ఎలా తయారుచేయాలో చూద్దాం.

నాటుకోడి కూర తయారీకి కావాల్సిన పదార్ధాలు

  • నాటుకోడి చికెన్ - ఒక కేజీ
  • ధనియాలు - రెండు టీస్పూన్స్
  • కొబ్బరి కోరు - ఒక టీ స్పూన్
  • గసగసాలు - రెండు స్పూన్స్
  • లవంగాలు - రెండు
  • యాలకులు - రెండు
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - మూడు టీ స్పూన్స్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - 1/2 స్పూన్
  • కారం - మూడు టీ స్పూన్స్
  • గరం మసాలా - 1/2 టీ స్పూన్
  • టమాటో - రెండు
  • ఉల్లిపాయలు - మూడు
  • పచ్చి మిర్చి - 6 నుంచి 8
  • ధనియాలపొడి - 2 టీ స్పూన్స్
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • నూనె - 6 -8 టేబుల్ స్పూన్స్

నాటుకోడి కూర తయారీ విధానం

నాటుకోడి చికెన్ ను శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కడిగిన తరవాత చికెన్ ముక్కలకు కొద్దిగా ఉప్పు, పెరుగు వేసి 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి.ఇలా చేయటంవలన మాంసం మృదువుగా అవుతుంది. ఇప్పుడు ధనియాలు, గసగసాలను దోరగా వేయించి పొడి చేసుకోవాలి.ఈ మిశ్రమానికి కొబ్బరికోరును కూడా కలిపి కొద్దిగా నీళ్లు చల్లి ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక దాంట్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేలా రెండు నిముషాలు వేయించాలి. తరువాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, వేసి మరో మూడు నిముషాలు వేగనివ్వాలి.

ఇప్పుడు అందులో చికెన్ ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, టమాటో ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు మరియు ముందు తయారు చేసి పెట్టుకున్న గసగసాల కొబ్బరి ముద్ద  కూడా వేసి మొత్తం అన్ని కలిసేలా బాగా కలిపి, పైన మూత పెట్టి తక్కువ మంటపై ఐదు నిమిషాలు పాటూ వేయించుకోవాలి.

ఐదు నిముషాలు తరవాత మూత తీసి కావాల్సినన్ని నీళ్లు వేసుకుని మరో ఇరవైనిమిషాల పాటు మూతపెట్టి, మీడియం మంటమీద ఉడికించుకుని గ్రేవీ దగ్గరగా అయ్యాక దింపేయాలి. స్టవ్ ఆఫ్ చేసాక చివరిగా పైన కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది.

నాటుకోడి కూర తయారీకి కొన్ని చిట్కాలు

నాటుకోడి ముక్కలను కొద్దిగా ఉప్పు, పెరుగు మిశ్రమంలో ఓ ముప్పై నిమిషాల పాటూ నానబెట్టుకోండి.ఇలా చేయటంవలన మాంసం మృదువుగా అవుతుంది. అలాగే చికెన్ ముక్కలను నూనెలో ఎక్కువుగా వేయించకూడదు, ఆలా చేయటం వలన ముక్క గట్టిగా అవుతుంది.

ఉల్లిపాయలు, టమోటాలు బాగా మెత్తగా అయ్యేవరకు వేయించండి. ఇలా చేయటం వల్ల కర్రీకి మంచి రుచి వస్తుంది. తాజా మసాలా దినుసులు ఉపయోగించండి, మసాలాలు ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకుంటే మంచిది.

నాటుకోడి కూర వేడి వేడి అన్నం లేదా చపాతి, రాగి సంగటి, పరోటా, పూరి వంటి కాంబినేషన్లో సర్వ్ చేయండి.

నాటుకోడి కూర పోషక విలువలు

నాటుకోడి కూర చాలా పౌష్టికాహారం కలిగిన ఆహారం. నాటుకోడి కూరలో ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలు సంవృద్ధిగా లభిస్తాయి. ఇంకా ఇందులో కొవ్వు మరియు కొలెస్ట్రాల్ కూడా తక్కువుగా ఉంటాయి. ఇది బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

నాటుకోడి కూరలో విటమిన్ A, C, K, మరియు విటమిన్ B12 ఫుష్కలంగా లభిస్తాయి. నాటుకోడిలో పొటాషియం, సోడియం, కాల్షియం, ఐరన్, మెగ్నీసియం, మరియు జింక్ సంవృద్ధిగా ఉంటాయి. నాటుకోడి గుండె, ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది మరియు రోగనిరోధక శక్తీ, కండరాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

Post Comment