కర్ణాటక స్పెషల్ మైసూర్ బోండా రెసిపీ తయారీ విధానం
భారతీయ వంటకాలు

కర్ణాటక స్పెషల్ మైసూర్ బోండా రెసిపీ తయారీ విధానం

ఈ ఆర్టికల్ యందు టేస్టీ టేస్టీగా మైదా పిండి మరియు వెజిటబుల్స్ కాంబినేషన్లో చేసే బ్రేక్ ఫాస్ట్ రెసిపీ మైసూర్ బోండా తయారీ విధానం, బోండా తయారీకి కావాల్సిన పదర్ధాలు గూర్చి తెలుసుకుందాం. మీరు నేర్చుకుని ట్రై చేసి రుచి చూడండి.

మైసూర్ బోండా తయారీకి కావాల్సిన పదార్దాలు

  • మైదా పిండి – మూడు క‌ప్పులు
  • బియ్యం పిండి - అర కప్పు
  • పెరుగు – ఒక కప్పు
  • వంట‌సోడా – రెండు స్పూన్స్
  • జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్
  • ఉప్పు – త‌గినంత‌
  • ప‌చ్చిమిర్చి – నాలుగు
  • అల్లం త‌రుగు – ఒక స్పూన్
  • క‌రివేపాకు – రెండురెమ్మలు
  • కొబ్బ‌రి తురుము – మూడు స్పూన్స్
  • నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా

మైసూర్ బోండా తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో పుల్లటి పెరుగును తీసుకోవాలి. తరువాత అందులో వంట‌సోడా వేసి క‌ల‌పాలి. ఇప్పుడు అందులో జీల‌క‌ర్ర‌, మైదాపిండి, బియ్యం పిండి, నూనె కొద్దిగా, ఉప్పు సరిపడా వేసి కలుపుకోవాలి. త‌రువాత తగిన‌న్ని నీళ్లు పోసుకుంటూ ఉండ‌లు లేకుండా బోండా పిండిని రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి.. పిండి కలిపిన త‌రువాత దానిపై మూత పెట్టి ఒక గంట లేదా రెండు గంటల పాటు నాన‌బెట్టుకోవాలి.

గంట త‌రువాత పిండిలో పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, కొబ్బరి తురుము, కరివేపాకు వేసి మల్లి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఫ్రై చేయటానికి లోతుగా ఉన్న క‌ళాయి తీసుకుని అందులో ఫ్రై చేయటానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన త‌రువాత చేతుల‌కు త‌డి చేసుకుంటూ పిండిని ఒక ప‌క్క నుండి తీసుకుని బోండాలా వేసుకోవాలి. త‌రువాత మంట‌ను మీడియంగా ఉంచి రెండు వైపులా తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి.

ఇలా వేయించుకున్నాక బోండాల‌ను ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల హోట‌ల్ స్టైల్ లో ఉండే మైసూర్ బోండాలు త‌యార‌వుతాయి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల బోండాల లోప‌ల మెత్త‌గా ఉడ‌క‌డంతో పాటు బాగా పొంగుతాయి.

మైసూర్ బోండా తయారీకి కొన్ని చిట్కాలు

మైసూర్ బొండాలు మైదాతో పాటు బియ్యం పిండిని కూడా కలిపితే బొండాలు మృదువుగా వస్తాయి. పులుపు ఎక్కువ వున్న పెరుగు తీసుకోవాలి, అప్పుడే పిండి మిశ్రమం బాగా పులిసి బోండాలు మెత్తగా వస్తాయి. పిండిని మరీ ఎక్కువ సేపు కలపకూడదు. ఎక్కువ సేపు కలిపితే పిండి గట్టి పడుతుంది. పిండి కలిపిన తరవాత ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. బోండా టేస్టీగా కావాలనుకుంటే మిర్చి, ఉల్లి , జీరా, కొత్తిమీర వంటివి జోడించవచ్చు .

Post Comment