మటన్ బిర్యానీ తయారీ విధానం : పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ రెసిపీ
భారతీయ వంటకాలు

మటన్ బిర్యానీ తయారీ విధానం : పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ రెసిపీ

మీరు కూడా బిర్యానీ లవర్ అయితే..! ఈ ఆదివారం మీ దినచర్యను మటన్ బిర్యానీతో స్టార్ట్ చేసేయండి. ఆలస్యం చేయకుండా ఈ ఆర్టికల్ ద్వారా చక్కని మటన్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంచక్కా మీరు నేర్చుకుని, ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వండి.

మటన్ బిర్యానీ రెసిపీకి కావాల్సిన పదార్ధాలు

  • బాస్మతి బియ్యం - అరకిలో
  • ఏలకులు - రెండు
  • బిర్యానీ ఆకులు - రెండు
  • మిరియాలు - ఆరు
  • లవంగాలు - ఆరు
  • దాల్చిన చెక్క - ఒక చిన్న ముక్క
  • మెంతులు - ఒక టీ స్పూన్
  • జాజికాయ - కొద్దిగా
  • జాపత్రి - కొద్దిగా
  • ఉప్పు - సరిపడా
  • నూనె - సరిపడా.
  • మటన్ - అర కేజీ
  • గరంమసాలా - ఒక టేబుల్ స్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్స్
  • పెరుగు - నాలుగు టేబుల్ స్పూన్స్
  • నిమ్మకాయ - ఒకటి
  • కుంకుమపువ్వు - కొద్దిగా
  • రోజ్ వాటర్ - మూడు చుక్కలు
  • పచ్చిమిర్చి - నాలుగు
  • కారం - తగినంత
  • ధనియాల పొడి - 1/4 టీ స్పూన్
  • జీలకర్ర పొడి - 1/4 టీ స్పూన్
  • పుదీనా - రెండు రెమ్మలు
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
  • ఉల్లిపాయలు - నాలుగు
  • టమాటో - రెండు
  • పాలు - పావు కప్పు

మటన్ బిర్యానీ తయారు చేయు విధానం

ముందుగా మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తరవాత మటన్‌లో పెరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, నిమ్మరసం, గరంమసాలా వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్‌లో నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలలో సగం వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు కుక్కర్‌లో నెయ్యి వేసి కరిగాక మిగిలిన ఉల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఇందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. ఇలా వేగిన తరువాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న మటన్ జత చేసి ఐదు నిముషాలు మగ్గనివ్వాలి. మటన్ బాగా మగ్గిన తరువాత టమాటో గుజ్జు, ధనియాల పొడి, జీరా పొడి వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు అందులో నాలుగు కప్పులు నీళ్లు పోసి మూత ఉంచి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. తరవాత కుక్కర్ మూత తీసి ఉప్పు, గరంమసాలా, కొత్తిమీర వేసి మరో పదినిమిషాలు ఉడికించుకోవాలి.

అన్నం తయారీ : ముందుగా బియ్యం ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక వస్త్రంలో ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, జాజికాయ ముక్క, మిరియాలు వేసి మూటకట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక లీటర్ నీళ్లు పోసి మరిగించి, అందులో నానాబెట్టుకున్న బియ్యం, బిర్యానీ ఆకు, సరిపడా ఉప్పు, టీ స్పూన్ నూనె, మూట కట్టిన వస్త్రం ఉంచి అన్నం మూడు వంతులు ఉడికాక నీరు వంపేసి, మూట తీసేయాలి.

ఇప్పుడు ఒక కప్పులో పాలు, కుంకుమ పువ్వు వేసి బాగా కలపాలి. ఒక పెద్ద దళసరి గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కాగాక, నూనె మొత్తం ఆ గిన్నెకు లోపల అంతా అంటేలా కదపాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన బియ్యం, మటన్ ముక్కలు, కుంకుమపువ్వు పాలు, వేయించిన ఉల్లితరుగు, నెయ్యి వరుసగా ఒకదానిమీద ఒకటి లేయర్లుగా పరచాలి.

మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా అమర్చాలి. ఇప్పుడు పైన పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, వేయించిన ఉల్లి తరుగు, నిమ్మరసం, రోజ్ వాటర్ వేసి బరువైన మూత గట్టిగా పెట్టి ఓ పదిహేను నిమిషాలపాటు ఉంచి, స్టవ్ ఆఫ్ చేయటమే. అంతే ఘుమలాడే ఘుమలాడే మటన్ బిర్యాని రెడీ అయినట్లే.

మటన్ బిర్యానీ తయారీకి కొన్ని చిట్కాలు

బిర్యానికోసం బాస్మతి రైస్ తీసుకోండి. నిమ్మకాయ రసం, ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కడిగితే మటన్ లోని వాసనపోతుంది. మటన్ ముప్పై నిమిషాలపాటు నానబెట్టుకుంటే, ముక్క మెత్తగా అయి, తొందరగా ఉడుకుతుంది. మటన్‌ను మెత్తగా ఉడికించుకోవాలి. బిర్యానీ మసాలాలు డైరెక్టుగా వేయకుండా, ఒక గుడ్డలో మూటలా కట్టి ఉడుకుతున్న రైస్ లో ఉంచితే ఆవిరికి రసం అన్నంతో కలుస్తుంది.

బిర్యాని పొరలు పొరలుగా వేయాలి. ఇలా వేయటం వలన బిర్యానీ బాగా ఉడుకుతుంది మరియు రుచిగా ఉంటుంది. మొదటి పొరలో రైస్, రెండవ పొరలో మటన్ మరియు మసాలా, మూడవపొరలో మరలా రైస్, నాల్గవ పొరలో మటన్ పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసుకోవాలి. బిర్యాని ఇరవై నిమిషాలపాటు దమ్ లో ఉంచండి. బిర్యాని బాగా దమ్ పడితే టెస్ట్ మరింత పెరుగుతుంది.

మటన్ బిర్యానీలో పోషక విలువలు

మటన్ బిర్యానీలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదల మరియు పునరుద్దరణకు సహాయపడుతుంది. ఇందులో ఐరన్ కూడా సంవృద్ధిగా లభిస్తుంది, ఇది రక్త హీనతను నివారించటానికి సహాయపడుతుంది. మటన్ బిర్యానీలో విటమిన్ బి 12 అధికముగా ఉండి రక్త కణాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.

మటన్  బిర్యానీలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు మంచిది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండి, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్దకంను నివారిస్తుంది.

Post Comment