వెజిటబుల్ సాంబార్ తయారీ విధానం : సౌత్ ఇండియన్ సాంబార్ రెసిపి
భారతీయ వంటకాలు

వెజిటబుల్ సాంబార్ తయారీ విధానం : సౌత్ ఇండియన్ సాంబార్ రెసిపి

రోజూ ఒకే రకమైన వంట తిని విసుగుపుడుతోందా.. అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ మీ కోసమే. ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే వెజిటేబుల్ సాంబార్ తక్కువ సమయంలో ఎలా తయారుచేయాలో, సాంబార్ తయారీకి కావాల్సిన పదార్ధాలు ఏమిటో తెలుసుకుందాం.

వెజిటబుల్ సాంబార్ తయారీకి కావాల్సిన పదార్ధాలు

  • కంది పప్పు -  రెండు కప్పులు (టీ కప్ సైజు)
  • నీళ్లు - నాలుగు కప్పులు
  • వంకాయలు - రెండు
  • బెండకాయలు - నాలుగు
  • దోసకాయ - ఒకటి
  • ముల్లంగి - ఒకటి
  • మునక్కాడ - ఒకటి
  • సాంబార్ ఉల్లిపాయలు - ఆరు
  • టమాటో - రెండు
  • పచ్చి మిర్చి - మూడు
  • ఎండుమిర్చి -రెండు
  • చింతపండురసం - 1/2 కప్పు
  • పసుపు - 1/2 స్పూన్
  • నూనె - నాలుగు టేబుల్ స్పూన్స్
  • పోపుగుంజలు - ఒక టీ స్పూన్
  • సాంబార్ పొడి - ఒక టీ స్పూన్
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • వెల్లుల్లి - ఆరు రెబ్బలు
  • ఉప్పు - సరిపడా
  • ఇంగువ -  చిటికెడు

వెజిటబుల్ సాంబార్ తయారీ విధానం

ముందుగా అన్ని కూరగాయలు శుభ్రంగా కడిగి మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అలాగే కంది పప్పును కడిగి ఓ పది నిముషాలు నానబెట్టుకోవాలి . పదినిమిషాల తర్వాత కంది పప్పు, నాలుగు గ్లాసుల నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ నూనె కుక్కర్ లో వేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.

మరోపక్క మందపాటి గిన్నెలో ముందుగా కట్ చేసుకున్న అన్ని కూరగాయ ముక్కలు, పచ్చిమిర్చి, సాంబార్ ఉల్లిపాయలు వేయాలి, కూరగాయ ముక్కలు మునిగేలా నీళ్లు పోసి ఓ పదినిమిషాలు పాటు తక్కువ మంటపై ఉడికించుకోవాలి.

పదినిమిషాల తరవాత ఉడుకుతున్న ముక్కల్లో ముందుగా ఉడికించుకున్న పప్పు, టమోటా రసం, చింతపండు రసం వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, సాంబార్ పొడి, చిడికెడు ఇంగువ, కొత్తిమీర వేసి పదిహేను నిముషాలు పాటు మరిగించాలి. మిశ్రమం చిక్కగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్లు పోసుకోండి.

సాంబార్ మరుగుతుండగా తాళింపు కోసం ఒక కళాయిలో నూనె వేయాలి, నూనె వేడయ్యాక పోపుగింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసి బాగా వేయించి మరిగించిన మిశ్రమంలో వేసి మొత్తం కలిసేలా కలుపుకుని మూత  పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఈ రెసిపీని వేడి వేడి అన్నం, ఇడ్లి, దోశ లతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.

వెజిటబుల్ సాంబార్ తయారీకి కొన్ని చిట్కాలు

పప్పును బాగా ఉడికించండి, పప్పు బాగా ఉడికితేనే సాంబార్ రుచిగా వస్తుంది. పప్పు ఉడికించేటపుడు కొద్దిగా పసుపు వేసుకుంటే పప్పు రంగు మారకుండా ఉంటుంది. కూరగాయలు ముక్కలు మరీ చిన్నగా, పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి.

సాంబార్ ని ఎక్కువ సేపు మరిగించకండి, ఎక్కువ సేపు ఉడికిస్తే కూరగాయ ముక్కలు చెదిరిపోతాయి. సాంబారులో కొద్దిగా ఇంగువ వేయండి, ఇంగువ వేస్తే సాంబార్ రుచి మరింత పెరుగుతుంది. సాంబార్ చివర్లో ఉడుకుతున్నప్పుడు ఇంగువ వేయండి. సాంబార్ టేస్టీగా రావాలంటే తాళింపు సరిగ్గా వేగనివ్వాలి.

వెజిటబుల్ సాంబార్‌లో పోషకాలు

పప్పులో అధికంగా ప్రోటీన్స్, పీచుపదార్ధాలు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటిఆక్సిడెంట్స్ సంవృద్ధిగా లభిస్తాయి.

ప్రోటీన్స్ శరీర నిర్మాణానికి మరియు మరమ్మత్తుకు సహాయపడతాయి. పీచు పదార్ధాలు జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్దకాన్ని నివారిస్తుంది. విటమిన్లు కంటి చూపు, చర్మ రక్షణ, ఎముకుల ఆరోగ్యం మరియు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

Post Comment