రవ్వ ఉప్మా తయారీ విధానం : ఈజీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ, పోషకాలు
భారతీయ వంటకాలు

రవ్వ ఉప్మా తయారీ విధానం : ఈజీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ, పోషకాలు

బ్రేక్ ఫాస్ట్ లో చాలా వెరైటీలు ఉన్నాయి. అన్నింటిలోకి చాలా సులభంగా త్వరగా చేసుకునే రెసిపీ మాత్రం గోధుమ రవ్వ ఉప్మానే. ఉప్మాలో పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, జింక్, ఫాస్పరస్, ఐరన్ మరియు పిండి పదార్థాలు ఉంటాయి. ఈ ఆర్టికల్ యందు గోధుమ రవ్వతో ఉప్మా తయారీకి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గూర్చి తెలుసుకుందాం.

ఉప్మా తయారీకి కావాల్సిన పదార్ధాలు

  •  గోధుమ నూక - రెండు కప్పులు
  • నీళ్లు - ఐదు కప్పులు
  • ఆవాలు - ఒక టీ స్పూన్
  • శెనగపప్పు - ఒక టీ స్పూన్
  • మినపప్పు - ఒక టీ స్పూన్
  • పల్లీలు - తగినన్ని
  • జీడిపప్పు - తగినన్ని
  • ఉల్లిపాయ - ఒకటి
  • టమాటా - ఒకటి
  • ఎండు మిర్చి - రెండు
  • పచ్చి మిర్చి - ఒకటి
  • అల్లం తురుము - పావు టీ స్పూన్
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • ఉప్పు - సరిపడా
  • నూనె - ఒక టేబుల్ స్పూన్
  • నెయ్యి ఒక టేబుల్ స్పూన్

ఉప్మా తయారు చేసే విధానం

మొదటగా స్టవ్ ఆన్ చేసి పాన్‌లో నెయ్యివేసి,వేడయ్యాక జీడిపప్పు దోరగా వేయించి తీసి పక్కనబెట్టుకోవాలి. ఆ నెయ్యిలోనే గోధుమనూక వేసుకుని కలుపుతూ రెండు నిముషాలు వేయించుకోవాలి. వేయించిన తరువాత దానిని వేరే పళ్ళెంలోకి తీసుకోవాలి.

ఇప్పుడు అదే పాన్‌లో నూనె వేసి, వేడయ్యాక ఆవాలు, మినప పప్పు, శెనగపప్పు, పల్లీలు వేసి, చిటపటలాడాక ఆ పైన తరిగి ఉంచుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్ లో రెండు నిముషాలు కలుపుతూ బాగా వేయించాలి. పోపు కమ్మని వాసన వచ్చిన తరువాత అందులో తరిగిన ఉల్లిపాయ, టమాటో ముక్కలు వేసి ఐదునిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు సరిపడా నీరుపోసి, తగినంత ఉప్పు కూడా వేసి మూతపెట్టుకోవాలి.

నీరు బాగా మరిగి కెర్లిన తరువాత వేయించిన గోధుమ నూక కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. రవ్వ మెత్తబడి దగ్గరగా అయిన తర్వాత కిందకి దించి, వేయించిన జీడిపప్పు వేసి సర్వ్ చేసుకోవటమే.

ఉప్మా తయారీకి కొన్ని చిట్కాలు

గోధుమ నూకను దోరగా వేయించుకోవాలి. నూక వేయించుకుంటే ఉప్మా రుచి బాగుంటుంది. ఉప్మాలో నూనెకు బదులు , నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు. ఉప్మాలో ఎక్కువ పోషకాలు కావాలనుకుంటే క్యారెట్, కాప్సికం, బఠానీ, ఆలూ లాంటి కూరగాయలు వేసుకోవచ్చు. ఉప్మా రుచి పోపులోనే ఉంటుంది కాబట్టి పోపుని సరిగ్గా వేగనివ్వాలి. పోపు ఎంత బాగా వేగితే ఉప్మా రుచి అంత బాగుంటుంది.

ఉప్మాలో పోషక విలువలు

ఉప్మాలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, జింక్, ఫాస్పరస్, ఐరన్ మరియు పిండి పదార్థాలు ఉంటాయి, ఇది ప్రతి వయస్సు వారికి ఆరోగ్యకరమైన ఎంపిక. ఉప్మా మీ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఉప్మాలో ఉండే పోషకాలు మీ గుండె, ఎముకలు, మూత్రపిండాలు మరియు రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి మరియు వాటి పనితీరును మెరుగుపరుస్తాయి.

ఇందులో కొలెస్ట్రాల్ మరియు కేలరీలు తక్కువగా ఉంటాయి, ఇది ఆరోగ్యకరమైన భోజనంగా మరియు సమతుల్య ఆహారంలో మీకు సహాయపడుతుంది. ఉప్మాలోని ఫైబర్ సంవృద్ధిగా లభిస్తుంది. ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మెరుగుపరచటంలో మరియు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

Post Comment