తెలంగాణ స్పెషల్ బగారా రైస్ తయారీ విధానం : బగారా రైస్ రెసిపీ
భారతీయ వంటకాలు

తెలంగాణ స్పెషల్ బగారా రైస్ తయారీ విధానం : బగారా రైస్ రెసిపీ

ఈ ఆర్టికల్ యందు మన అందరికి ఇష్టమైన తెలంగాణ స్పెషల్ రెసిపీ బగారా రైస్ తయారీకి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గూర్చి తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతంలో వివాహాలు మరియు ఫంక్షన్లలో ఈ బగరా అన్నం ఒక ప్రసిద్ధ వంటకం. బగారా అన్నంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

బగారా రైస్ తయారీకి కావాల్సిన పదార్ధాలు

  • బాస్మతీ రైస్ - నాలుగు కప్పులు
  • దాల్చిన చెక్క - ఒక చిన్న ముక్క
  • లవంగాలు - నాలుగు
  • యాలకులు - నాలుగు
  • జీరా -  రెండు టీ స్పూన్స్
  • మిరియాలు పొడి - పావు టీ స్పూన్
  • ఉల్లిపాయ - రెండు కట్ చేసుకోవాలి
  • అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
  • పచ్చిమిర్చి - నాలుగు
  • కొత్తిమీర - నాలుగు రెమ్మలు
  • పుదీనా - రెండు రెమ్మలు
  • ఉప్పు - తగినంత
  • గరం మసాలా - 1/2 స్పూన్
  • నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
  • నూనె - రెండు టేబుల్ స్పూన్స్
  • నీళ్లు - ఎనిమిది కప్పులు

బగారా రైస్ తయారు చేయు విధానం

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఇరవై నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి, నూనె నెయ్యి వేడయ్యాక దానిలో దాల్చిన చెక్క, జీరా, లవంగాలు, యాలకులు, మిరియాలు పొడి వేసి వేయించాలి.

మసాలా దినుసులు వేగి సువాసన వచ్చాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగులో మారేంతవరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక , అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. ఇప్పుడు దానిలో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి అన్నీ కలిపి రెండు నిముషాలు వేయించాలి.

అనంతరం ముందుగా నానబెట్టిన బియ్యం, సరిపడా ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలిపి దానిలో ఎసరకి తగ్గ నీళ్లు పోసి అధిక మంట మీద ఐదునిమిషాలు ఉడికించాలి. నీరు దగ్గరగా అయిన తర్వాత పది నిమిషాలు లో- ఫ్లేమ్ లో దమ్ మీద ఉంచండి. అంతే బగారా రైస్ రెడీ. చివరిగా కొత్తిమీర, మిగిలిన నెయ్యి వేసి దీనిని వేడిగా సర్వ్ చేయండి.

బగారా రైస్‌లో లభించే పోషకాలు

బగరా అన్నంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి, ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. బగారా రైస్ లో ప్రోటీన్ కూడా సంవృద్ధిగా ఉంటుంది, ఇది కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి ఉపయోగపడుతుంది. బగారా అన్నంలో కొవ్వు ఎక్కువగా మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు రూపంలో లభిస్తాయి, ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులుగా పరిగణించబడతాయి.

బగారా బియ్యంలో ఉపయోగించే మసాలా దినుసులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. లవంగాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఏలకులు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Post Comment