నిమ్మకాయతో రవ్వ పులిహోర తయారీ విధానం : రవ్వ పులిహోర
భారతీయ వంటకాలు

నిమ్మకాయతో రవ్వ పులిహోర తయారీ విధానం : రవ్వ పులిహోర

రోజూ ఒకే రకమైన వంట తిని విసుగుపుడుతోందా..! అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ మీ కోసమే. చాలా తక్కువ సమయంలో అదిరిపోయే నిమ్మకాయ, గోధుమ రవ్వ కాంబినేషన్లో పులిహోర ఎలా తయారుచేయాలి, ఎలా కలుపుకోవాలి, తయారీకి కావాల్సిన పదార్ధాలు ఏమిటో ఈ ఆర్టికల్ యందు తెలుసుకుందాం.

గోధుమ రవ్వ పులిహోర తయారీకి కావాల్సిన పదార్దాలు

  • గోధుమ రవ్వ - ఒక గ్లాస్
  • నీళ్లు - రెండు గ్లాస్లు
  • నూనె - ఒక టేబుల్ స్పూన్
  • నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
  • ఎండుమిర్చి - రెండు
  • అల్లం తురుము - పావు టీ స్పూన్
  • పచ్చి మిర్చి - రెండు
  • శెనగపప్పు - ఒక స్పూన్
  • మినపప్పు - ఒక స్పూన్
  • ఆవాలు - ఆఫ్ స్పూన్
  • ఇంగువ - పావు టీ స్పూన్
  • పల్లీలు - పిడికెడు
  • పసుపు - ఆఫ్ టీ స్పూన్
  • ఉప్పు సరిపడా
  • నిమ్మకాయ - 1 లేదా 2
  • కరివేపాకు - నాలుగు రెమ్మలు

గోధుమ రవ్వ పులిహోర తయారీ విధానం

ముందుగా స్టవ్ ఆన్ చేసి లో- ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, వెంటనే రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కొద్దిగా మరుగుతుండగా పసుపు, సరిపడా ఉప్పు,గోధుమరవ్వ వేసి కలుపుకోవాలి. రవ్వ వేసాక మద్య మద్యలో కలుపుతూ ఉండాలి. రవ్వ ఉడికి దగ్గరగా పొడి పొడిగా అయ్యాక దించి చల్లారనివ్వాలి.

ఇప్పుడు మరో పక్క పోపు కోసం ఒక పాన్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి, కరిగాక ఆవాలు, శెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి పల్లీలు, అల్లం తురుము, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి పోపును మంచి సువాసన వచ్చేలా వేయించాలి.

ఇప్పుడు వేయించిన పోపు మిశ్రమం, ఉడికించిన రవ్వ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి ( పులిహోర కలిపినట్లు కలుపుకోవాలి). కలిపాక నిమ్మరసం వేసి మరో సారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు సరిపోక పోతే నిమ్మరసంలో వేసి కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ గోధుమ రవ్వ పులిహోర రెడీ అయినట్లే. వేడివేడిగా కాకుండా కొద్దిగా చల్లారాక సర్వ్ చేయండి రుచి బాగుంటుంది.

గోధుమ రవ్వ పులిహోర తయారీకి కొన్ని చిట్కాలు

నూనె లేదా నెయ్యి తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేస్తే రవ్వ మెత్తబడి ముద్దలా అవుతుంది. నీళ్లు మరిగించేప్పుడు అందులో నూనె వేసుకుంటే రవ్వ అంటుకోకుండా ఉడుకుతుంది. అలానే రవ్వ ఉడికించేటపుడు పసుపు వేసుకుంటే మొత్తం ఒకే రంగులో ఉడుకుతుంది. రవ్వ పులిహోరలో నిమ్మకాయకి బదులుగా చింతపండు రసం కలుపుకోవచ్చు. గోధుమరవ్వ పులిహోర టేస్టీగా రావాలంటే పోపు బాగా వేయించాలి.

గోధుమ రవ్వ పులిహోరలో లభించే పోషకాలు

రవ్వలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో మరియు ఆకలి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఇది శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. రవ్వలోని పొటాషియం కంటెంట్ మూత్రపిండాల ఆరోగ్యం మరియు పనితీరును మెరుగుపరుస్తుంది.

రవ్వ నాడీ వ్యవస్థ యొక్క సరైన పనితీరుకు ముఖ్యమైన భాస్వరం, జింక్ మరియు మెగ్నీషియం యొక్క మంచి మూలం. రవ్వలో తగినంత కాల్షియం మరియు మెగ్నీషియం లభిస్తాయి, ఇవి మీ కండరాలను బలంగా ఉంచటంలో సహాయపడతాయి. సెలీనియం, విటమిన్ బి కాంప్లెక్స్ మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

రవ్వ పులిహోరలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ స్థాయిలను పెంచడం, రక్తపోటును తగ్గించడం, గౌట్ దాడుల నుండి రక్షించడం, ఇనుము శోషణను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం మరియు గుండె జబ్బులు మరియు చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Post Comment