పుదీనా పన్నీర్ పులావ్ తయారీ విధానం : పనీర్ పులావ్ రెసిపీ
భారతీయ వంటకాలు

పుదీనా పన్నీర్ పులావ్ తయారీ విధానం : పనీర్ పులావ్ రెసిపీ

సాధారణంగా రైస్‌తో వివిధ రకాల వెరైటీలను వివిధ రకాల ఫ్లేవర్స్ తో తయారు చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్ యందు పన్నీర్ పుదీనా కాంబినేషన్లో చేసే పుదీనా పన్నీర్ పులావ్ రెసిపీని ఎలా తయారు చేయాలో, కావాల్సిన పదార్ధాలు ఏమిటో తెలుసుకుందాం.

పుదీనా పన్నీర్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్ధాలు

  • బాస్మతి రైస్ - మూడు కప్పులు
  • పన్నీర్ - 200 గ్రా..
  • పుదీనా - అర కప్పు
  • కొత్తిమీర - అర కప్పు
  • ఉల్లిపాయలు - రెండు
  • లవంగాలు - నాలుగు
  • జీలకర్ర - 1/4 స్పూన్
  • మెంతులు - 1/4 స్పూన్
  • పచ్చిమిర్చి - నాలుగు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - రెండు టేబుల్ స్పూన్స్
  • నీళ్లు - ఆరు కప్పులు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
  • కారం - ఒక టీ స్పూన్
  • పసుపు - 1/4 స్పూన్
  • ధనియాల పొడి - 1/2 స్పూన్
  • గరంమసాలా - 1/4 స్పూన్
  • నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్

పుదీనా పన్నీర్ పులావ్ తయారు చేసే విధానం

రైస్‌ను శుభ్రంగా కడిగి కనీసం ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నాన్-స్టిక్ పాన్‌లో నెయ్యి వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు గోధుమ రంగు వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. తరవాత అదే పాన్‌లో నూనె వేసి కాగాక జీలకర్ర, లవంగాలు, మెంతులు వేసి ఒక నిమిషం వేగాక అల్లం, వెల్లుల్లి ముద్ద కూడా వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.

ఇప్పుడు అందులో కారం పొడి, పసుపు పొడి,ధనియాలపొడి మరియు గరం మసాలా వేసి బాగా కలిపి. తరువాత, పచ్చిమిర్చి, పుదీనా ఆకులు మరియు కొత్తిమీర ఆకులు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఆకులు మెత్తబడి వరకు వేయించాలి.

ఈ ప్రక్రియ తర్వాత చివరగా, నానబెట్టిన రైస్ మరియు ఐదు లేదా ఆరు కప్పుల నీరు వేసి మొత్తం బాగా కలుపుకొని పాన్‌ను మూతపెట్టి, మీడియం వేడి మీద పులావ్‌ను ఉడికించండి. నీరు ఆవిరైపోయిన తర్వాత, ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి వేడిని తగ్గించి మరో ఐదు నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

స్టవ్ ఆఫ్ చేశాక పైన ముందుగా వేయించిన ఉల్లి తరుగును, కొత్తిమీర అలంకరించుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా పుదీనా పన్నీర్ పులావ్ సిద్ధం అయినట్లే.

పుదీనా పన్నీర్ పులావ్ తయారీకి కొన్ని చిట్కాలు

పన్నీర్ పులావ్ మంచి రుచి కోసం బాస్మతి బియ్యాన్ని ఉపయోగించండి. బియ్యాన్ని బాగా కడగాలి. వండడానికి ముందు బియ్యాన్ని కనీసం 30 నిమిషాలు నానబెట్టండి. ఇలా చేయటం వలన బియ్యం సమానంగా ఉడకడానికి మరియు మెత్తగా అవ్వకుండా ఉపయోగపడుతుంది. పులావ్ ఉత్తమ రుచి కోసం తాజా పుదీనా ఆకులను ఉపయోగించండి.

పనీర్ గట్టిగా మరియు రబ్బర్ లాగా మారుతుంది కాబట్టి దానిని అతిగా ఉడికించవద్దు. అన్నం దాదాపు ఉడికిన తర్వాతే అన్నంలో పనీర్ జోడించండి. ఇలా చేయటం వలన  పనీర్ ఎక్కువగా ఉడకకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. మీరు మీ పులావ్‌కి కొంచెం అదనపు రుచిని జోడించాలనుకుంటే, మీరు తాజా కూరగాయలను కూడా జోడించవచ్చు. పులావ్‌ను రైతా లేదా చట్నీతో వేడిగా సర్వ్ చేయండి.

పుదీనా పన్నీర్ పులావ్ లో పోషకపదార్ధాలు

పుదీనా పన్నీర్ పులావ్ లో పోషకపదార్దాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో కార్బోరేట్లు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు మరియు మాంసకృత్తులు సంవృద్ధిగా ఉంటాయి.

బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. పన్నీర్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది కండరాల పెరుగుదల మరియు పునరుద్ధరణకు సహాయపడతాయి. పనీర్‌లో కొంత మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి హృదయ ఆరోగ్యానికి మంచివి.

అలాగే పుదీనా ఆకులలో విటమిన్ ఎ, సి మరియు కె పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి మరియు ఎముకల ఆరోగ్యానికి మంచివి. పన్నీర్ మరియు పుదీనా ఆకులలో పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం వంటి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల పనితీరును మరియు రక్తపోటును నియంత్రించడానికి ఎముకల ఆరోగ్యానికి మంచి పోషకాలు.

Post Comment