మినప గారెలు తయారీ విధానం : హోటల్ స్టైల్ మినప వడలు
భారతీయ వంటకాలు

మినప గారెలు తయారీ విధానం : హోటల్ స్టైల్ మినప వడలు

ఈ ఆర్టికల్ యందు పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ కోసం ఎంచక్కా ఇంట్లోనే మినప్పప్పు మరియు ఉల్లి, మిర్చి కాంబినేషన్లో మినప వడలు తయారీకి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గూర్చి తెలుసుకుందాం.

మినప గారెలు తయారీకి కావాల్సిన పదార్దాలు

  • మిన‌ప ప‌ప్పు – రెండు కప్పులు
  • ఉల్లిపాయలు – రెండు
  • ప‌చ్చి మిర్చి – రెండు
  • అల్లం – చిన్న ముక్క
  • జీరా - అర స్పూన్
  • క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు
  • కొత్తిమీర – కొద్దిగా
  • ఉప్పు – త‌గినంత‌
  • వంట‌సోడా – చిటికెడు
  • నూనె – డీప్‌ ఫ్రై కి స‌రిప‌డా

మినప గారెలు తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో మిన‌ప ప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డిగి త‌గిన‌న్ని నీళ్లు పోసి నాలుగు గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి. ఇలా నాన‌బెట్టుకున్న మిన‌ప‌ప్పును మిక్సీజార్ లో కానీ, గ్రైండ‌ర్ లో కానీ కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌ని పిండిలా రుబ్బుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిని ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. పిండిని ఇలా ఫ్రిజ్ లో ఉంచ‌డం వ‌ల్ల వ‌డ‌లు కొంచెం క్రిస్పీ గా వస్తాయి.

ఒక గంట త‌రువాత పిండిని తీసుకుని అందులో చిన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీరా, అల్లం తురుము, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంటసోడా వేసి మొత్తం మిశ్రమం బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి క‌ళాయిలో వేయించటానికి సరిపడా నూనె వేయాలి. నూనె బాగా వేడయ్యాక చేతికి కొద్దిగా నీటితో త‌డి చేసుకుంటూ కావ‌ల్సిన ప‌రమాణంలో పిండిని తీసుకుని వ‌డ‌ల ఆకారంలో వ‌త్తుకుని నూనెలో వేసి రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీగా రుచిక‌ర‌మైన మిన‌ప వ‌డ‌లు త‌యార‌వుతాయి.

మినప గారెలు తయారీకి కొన్ని చిట్కాలు

పప్పును ముందురోజు రాత్రి లేదా కనీసం 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. పప్పు ఎంత బాగా నానితే వడలు అంత మెత్తగా వస్తాయి. పప్పును మరీ మెత్తగా రుబ్బుకోవద్దు. మరీ మెత్తగా రుబ్బితే వడలు గట్టిగా అవుతాయి. పిండి పల్చగా కాకుండా చూసుకోవాలి, పప్పు రుబ్బుకునేటపుడు కొద్దికొద్దిగా నీళ్లు వేసుకోవాలి. పప్పు రుబ్బుకున్నతర్వాత రుబ్బుని వీలైతే ఒక గంటపాటు ఫ్రిజ్లో లేదా బయటపెట్టుకుని పులియ పెట్టుకోవాలి. గారెలు వేసుకున్నాక పేపర్ పై వేసుకుంటే గారెలు పీల్చుకున్న ఆయిల్ తొలగిపోతుంది. గారెలు కాంబినేషన్ గా నాన్ వెజ్ లేదా కొబ్బరి చట్నీ బాగుంటుంది.

మినప గారెలులో లభించే పోషకాలు

మినప వడలలో ప్రధాన పదార్ధం, ప్రోటీన్. మరియు విటమిన్ బి, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి పోషకపదార్దాలు పుష్కలంగా లభిస్తాయి. నల్ల పప్పు లేదా మినపప్పు చాలా పప్పుధాన్యాల కంటే అధిక ప్రోటీన్ విలువను కలిగి ఉంటుంది. ఇది డైటరీ ఫైబర్, ఐసోఫ్లేవోన్లు, విటమిన్ బి కాంప్లెక్స్ , ఐరన్, కాపర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం, ఫాస్పరస్ యొక్క అద్భుతమైన మూలం.

Post Comment