టమాటో పులావ్ రెసిపీ తయారీ విధానం : పోషకాలు, చిట్కాలు
భారతీయ వంటకాలు

టమాటో పులావ్ రెసిపీ తయారీ విధానం : పోషకాలు, చిట్కాలు

టమాటోలతో చేసే వంటకాలలో టమాటో పులావ్ ఎంత పాపులర్ రెసిపీనో మనకు తెలిసిందే. ఈ రెసిపీను చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఈ రోజు ఈ ఆర్టికల్ ద్వారా టమాటో పులావ్ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్ధాలును, ఎలా తయారు చేసుకోవాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటో పులావ్ తయారీకి కావాల్సిన పదార్ధాలు

  • సన్న బియ్యం - రెండు గ్లాస్లు
  • టమాటోలు - మూడు
  • ఉల్లిపాయలు - రెండు
  • పుదీనా - రెండు రెమ్మలు
  • పచ్చి మిర్చి - నాలుగు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
  • నూనె - మూడు టేబుల్ స్పూన్స్
  • నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
  • యాలకులు - రెండు
  • లవంగాలు - నాలుగు
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • షాజీరా - 1/2 స్పూన్
  • ఉప్పు - తగినంత
  • జీడిపప్పు - తగినన్ని
  • కొత్తిమీర - రెండు రెమ్మలు

టమాటో పులావ్ తయారీ విధానం

ముందుగా బియ్యం కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. జీడిపప్పు నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. తరవాత టమాటాలను చిన్న ముక్కలుగా తరిగి, మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

అన్ని సిద్ధం చేసుకున్న తరువాత, జీడీ పప్పు వేయించిన పాన్‌లో మిగిలి ఉన్న నెయ్యిలో సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి మెత్తబడ్డాక పుదీనా ఆకులు, పచ్చి మిర్చి వేసి ఒక నిమిషం వేయించాలి.

ఒక నిమిషం తరువాత అందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, అల్లవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా రుబ్బుకున్న టమాటో ముద్దలో బియ్యానికి సరిపడా నీళ్లు పోసుకొని ( ఒక గ్లాస్ బియ్యానికి- రెండు గ్లాసుల నీళ్లు) వేగుతున్న తాళింపు మిశ్రమంలో వేయాలి.

తరవాత, ఎసరు మరుగుతుండగా దాంట్లో సరిపడా ఉప్పు, ముందుగా నానబెట్టుకున్న బియ్యం వడగట్టి వేసి, మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. బియ్యం తొంబైశాతం ఉడికిన తరువాత, మంట పూర్తిగా తగ్గించి, లో- ఫ్లేమ్ లో ఓ ఐదు నిముషాలు మగ్గనివ్వాలి. అంతే యమ్మీ యమ్మీ టమాటో పులావ్ రెడీ అయినట్లే. స్టవ్ ఆఫ్ చేసాక చివరిగా కొత్తిమీర, వేయించిన జీడిపప్పు వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.

టమాటో పులావ్ తయారీకి కొన్ని చిట్కాలు

పులావ్ కోసం బియ్యం ఇరవై నుంచి ముప్పై నిమిషాలపాటు నానబెట్టండి. ఇలా చేయటం వలన అన్నం తొందరగా ముద్ద కాకుండా ఉడుకుతుంది. మసాలా దినిసులు సువాసన వచ్చేవరకు వేయించండి. ఇలా చేయటం వలన పులావ్ మంచి వాసనతో టేస్టీగా ఉంటుంది.

ఉల్లిపాయలు సన్నగా- నిలువుగా తరిగి బాగా వేయించుకోవాలి. మసాలాలు సమపాళ్లలో వేసుకోండి, లేదంటే పులావ్ ఘాటుగా తయారవుతుంది. పులావ్ ఉడికిన తరువాత పైన కొంచెం నెయ్యి వేస్తే మంచి టేస్టీగా వస్తుంది.

టమాటో పులావ్‌లో పోషకాలు

టమాటో పులావ్‌లో కార్బోహైడ్రేట్స్ అధికంగా లభిస్తాయి, ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. దీనిలో లభించే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చి, మలబద్దకంను నివారిస్తుంది.

టమాటో పులావ్‌లో విటమిన్ A, C, K లు సంవృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచటానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చటనికి మరియు ఎముకులు బలపరచటానికి సహాయపడతాయి.

టమాటో పులావ్‌లో పొటాషియం, మెగ్నీషియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తపోటును నియంత్రించటానికి, కండరాల పనితీరు, రక్తహీనతను నివారించటానికి ఉపయోగపడతాయి.

Post Comment