చికెన్ హలీమ్ తయారీ విధానం : రంజాన్ స్పెషల్ చికెన్ హలీమ్
భారతీయ వంటకాలు

చికెన్ హలీమ్ తయారీ విధానం : రంజాన్ స్పెషల్ చికెన్ హలీమ్

ముస్లింల పవిత్రమాసమైన ‘రంజాన్’ సందర్భంగా ఎన్నోరకాల రుచికరమైన వంటకాలు ప్రత్యేకంగా చేసుకుంటారు. అందులో ముఖ్యమైంది ‘హలీమ్’. చికెన్, మటన్, వెజిటేరియన్ ఇలా వివిధ ఫ్లేవర్స్ లో వండుకునే ఈ రెసిపిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రోజు మరి అటువంటి చికెన్ హలీమ్ ఎంచక్కా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈ ఆర్టికల్ యందు తెలుసుకుందాం.

చికెన్ హలీమ్ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • బోన్ లెస్ చికెన్ - అరకేజీ
  • గోధుమ రవ్వ - పావుకేజి
  • శెనగపప్పు - గరిటెడు
  • బియ్యం - అర గరిటెడు
  • పచ్చిమిర్చి - ఐదు
  • అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్స్
  • పసుపు - ఒక టీ స్పూన్
  • కారం పొడి - రెండు టీ స్పూన్స్
  • గరం మసాలాపొడి - ఒక టీ స్పూన్స్
  • మిరియాలపొడి - ఒక టీ స్పూన్
  • పుట్నాలపొడి - ఒక టీ స్పూన్
  • సొంటి పొడి - అర టీ స్పూన్
  • పుదీనా - రెండు రెమ్మలు
  • కొత్తిమిర - నాలుగు రెమ్మలు
  • ఉల్లిపాయ - మూడు
  • లవంగాలు - 8
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • యాలకులు - 8
  • షాజీరా - 2 టీ స్పూన్స్
  • పెరుగు - 1 కప్పు
  • ఉప్పు - తగినంత
  • నూనె -  నాలుగు టేబుల్ స్పూన్స్
  • నెయ్యి - రెండు స్పూన్స్
  • జీడీ పప్పు - తగినన్ని

చికెన్ హలీమ్ తయారీ విధానం

ముందుగా కుక్కర్లో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు తీసుకుని, అందులో శెనగపప్పు, బియ్యం, చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్ద, సగం యాలకులు, లవంగాలు, దాల్చిన, షాజీరా, సగం పుదీనా, రెండు పచ్చిమిర్చి, కొత్తిమిర మరియు సగం చెంచాడు పసుపు కూడా వేయాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.

మూడు విజిల్స్ వచ్చాక ఇప్పుడు అందులో గోధుమ రవ్వ వేసి కలిపి మూతపెట్టి, మరో మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి.చికెన్ మెత్తగా ఉడికిన తరవాత పుట్నాలపొడి వేసి మొత్తం కలిసేలా కలుపుకుని కిందకు దించి గరిటెతో మెత్తగా రుబ్బుకోవాలి.

ఇప్పుడు ఒక పాన్ లేదా మందపాటి గిన్నె పెట్టి నూనె వేడి చేయాలి. ఇందులో మిగిలిన లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీర , అల్లం వెల్లుల్లి ముద్ద, మిగిలిన పచ్చిమిర్చి నూరి వేయాలి. ఇలా కొద్దిగా వేగాక కారం పొడి, మిరియాలపొడి, సొంటిపొడి, గరం మసాలాపొడి వేసి కలుపుతూ వేయించాలి. తర్వాత ఇందులో కప్పుడు పెరుగు కూడా వేసి కలపాలి.

తర్వాత మెత్తగా రుబ్బి పెట్టుకున్న చికెన్ మిశ్రమం, తగినంత ఉప్పు వేసి చిన్న మంటమీద కలుపుతూ ఉడికించాలి. లేదా పొయ్యి మీద ఇనప పెనం పెట్టి దాని మీద ఈ గిన్నె పెడితే మాడకుండా నిదానంగా ఉడుకుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మిగిలిన కొత్తిమిర, పుదీనా నూనెలో కరకరలాడేలా వేయించి పెట్టుకోవాలి. అలాగే జీడీ పప్పు కూడా దోరగా వేయించి పక్కనపెట్టుకోవాలి.

హలీమ్ మొత్తం ఉడికి మంచి వాసన వస్తున్నప్పుడు నెయ్యి వేసి కలిపి మరో ఐదు నిముషాలు ఉంచాలి. మొత్తం ఉడికి నూనె నెయ్యి కలిసి పైకి తెలుతుండగా దింపేసి సర్వింగ్ బౌల్‌లో వేసి, ముందుగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు, జీడీ పప్పు, కొత్తిమిర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేసి నిమ్మరసం పిండి సర్వ్ చేయాలి. అంతే ఘుమఘుమలాడే చికెన్ హలీమ్ రెడీ అయినట్లే.

చికెన్ హలీమ్ లో లభించే పోషక విలువలు

చికెన్ హలీమ్ లో కేలరీలు, ప్రోటీన్స్ , కొవ్వుపదార్దాలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్లు ఎ, సి, ఇ, కె, మరియు కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, సోడియం వంటి పోషక పదార్దాలు సంవృద్ధిగా లభిస్తాయి.

హలీమ్‌ను గోధుమ రవ్వ మరియు కాయధాన్యాలతో తయారు చేస్తారు, ఇవి రెండూ ఫైబర్ యొక్క మంచి మూలాలు. ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా మరియు సక్రమంగా ఉంచడానికి సహాయపడుతుంది. చికెన్ హలీమ్ అధిక కేలరీల వంటకం, ఇది కార్బోహైడ్రేట్లు మరియు ప్రొటీన్‌లతో కూడి ఉంటుంది.

చికెన్ హలీమ్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉండి, ఇది కండరాల నిర్మాణానికి మరియు మరమ్మత్తుకు ఉపయోగపడుతుంది. చికెన్ హలీమ్ లో విటమిన్లు మరియు ఖనిజాల సంవృద్ధిగా లభిస్తాయి, ఇవి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు ఉపయోగపడతాయి. చికెన్ హలీమ్‌లోని యాంటీ-ఆక్సిడెంట్ సమ్మేళనాలు గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Post Comment