కొత్తిమీర రైస్ తయారీ విధానం : కొత్తిమీర పులావ్ రెసిపీ
భారతీయ వంటకాలు

కొత్తిమీర రైస్ తయారీ విధానం : కొత్తిమీర పులావ్ రెసిపీ

సాధారణంగా రైస్ కాంబినేషన్లో చేసే ప్రతీ రెసిపీ ఒక ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. ఈ ఆర్టికల్ యందు కొత్తిమీర మరియు రైస్ కాంబినేషన్లో చేసే కొత్తిమీర రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలి, తయారీకి కావాల్సిన పదార్ధాలు ఇక్కడ తెలుసుకుందాం. కొత్తిమీర రైస్‌లో పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి, మీరు కూడా నేర్చుకుని ట్రై చేయండి.

కొత్తిమీర రైస్ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • రైస్ - మూడు కప్పులు
  • కొత్తిమీర - ఒక కప్పు
  • పుదీనా - అర కప్పు
  • ఉల్లి పాయలు - రెండు
  • యాలకులు - రెండు
  • లవంగాలు - నాలుగు
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • జీరా - ఒక టీ స్పూన్
  • బిర్యానీ ఆకు - ఒకటి
  • పచ్చి మిర్చి - నాలుగు
  • మినపప్పు - ఒక టీ స్పూన్
  • శెనగపప్పు - ఒక టీ స్పూన్
  • ఆవాలు - అర టీ స్పూన్
  • కారం - సరిపడా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
  • జీడీ పప్పు - తగినన్ని
  • ఉప్పు - సరిపడా
  • పసుపు - చిటికెడు
  • నూనె - రెండు టేబుల్ స్పూన్స్
  • నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్

కొత్తిమీర రైస్ తయారు చేయు విధానం

ముందుగా రైస్ శుభ్రంగా కడిగి ఇరవై నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి సగం ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవాలి. తరవాత కొత్తిమీర, పుదీనాను శుభ్రం చేసి మిక్సీ లో వేసి, కొత్తిమీరతో పాటు పచ్చిమిర్చి వేసి పేస్టు రెడీ చేసుకోవాలి.

తర్వాత పాన్ స్టౌ మీద పెట్టి కొంచెం నూనె రెండుస్పూన్ల నెయ్యి వేసుకుని కొంచెం వేడి ఎక్కిన తర్వాత జీరా, బిర్యానీ ఆకు,యాలకులు దాల్చిన చెక్క, లవంగాలు వేసి రెండు నిముషాలు వేయించాలి. తరవాత మిగిలిన ఉల్లి పాయ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించాలి.

తర్వాత అందులో జీడిపప్పు, మినపప్పు , శనగపప్పు , ఆవాలు వేసి వేయించాలి. తర్వాత అందులో కొత్తిమీర పేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్ ను వేసుకుని కొద్దిగా పసుపు. సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసుకుని పచ్చివాసన పోయేవరకూ కొత్తిమీర పేస్ట్ ను వేయించాలి.

తాళింపు మిశ్రమం కమ్మటి వాసన వచ్చిన తర్వాత అందులో ముందుగా నానబెట్టిన రైస్ వేసుకుని కొత్తిమీర పేస్ట్ కలిసేలా బాగా కలుపుకోవాలి.అనంతరం రైస్ ఉడికించటానికి సరిపడా నీళ్ళుపోసి మూత పెట్టుకుని మీడియం మంటపై ఉడికించాలి. రుచికి ఉప్పు సరిపోకపోతే అదనంగా సరిపడా వేసుకోవాలి.

రైస్ దగ్గరగా అయ్యాక మంట తగ్గించి మరో పది నిముషాలు మగ్గనివ్వాలి, చివరిగా వేయించిన ఉల్లి తురుము, కొత్తిమీర, నెయ్యి వేసుకుంటే సరిపోతుంది.  అంతే ఎంతో రుచి కరమైన కొత్తిమీర రైస్ తయారు అయినట్లే. దీనిలో రైతా (పెరుగు పచ్చడి) చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

కొత్తిమీర రైస్‌లో లభించే పోషకాలు

కొత్తిమీరలో విటమిన్ K సంవృద్ధిగా లభిస్తుంది, ఇది మీ రక్తం గడ్డకట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ K మీ ఎముకలు తమను తాము రిపేర్ చేసుకోవడంలో సహాయపడుతుంది, అలాగే బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలనుకూడా నివారిస్తుంది మరియు విటమిన్ K మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

తాజా కొత్తిమీర ఆకుల రోజువారీ వినియోగం మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, మీ చర్మాన్ని ఉపశమనం చేస్తుంది, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలకు సహాయపడుతుంది మరియు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కొత్తిమీరలో కాల్షియం, పొటాషియం మరియు నియాసిన్ వంటి పోషకాలు సంవృద్ధిగా ఉన్నాయి మరియు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది కాబట్టి ఇది మూత్రపిండాల రోగులకు సహాయపడుతుంది.

అధిక రక్తపోటును నిర్వహించడానికి కొత్తిమీర ఒక అద్భుతమైన ఔషధం . ఇది హృదయానికి అనుకూలమైన ఫైబర్‌లతో నిండి ఉంటుంది. కొత్తిమీరలోని భాగాలు కాల్షియం అయాన్‌లు మరియు న్యూరోట్రాన్స్‌మిటర్ ఎసిటైల్‌కోలిన్‌తో సంకర్షణ చెందుతాయని అధ్యయనాలు పేర్కొన్నాయి, ఇది రక్తనాళాలలో ఉద్రిక్తతను తగ్గించడంలో సహాయపడుతుంది.

Post Comment