కాలీఫ్లవర్ మంచూరియా తయారీ విధానం : గోబీ మంచూరియా
భారతీయ వంటకాలు

కాలీఫ్లవర్ మంచూరియా తయారీ విధానం : గోబీ మంచూరియా

రోజూ సాయంత్రం ఒకే రకమైన స్నాక్స్ తిని తిని మీ ఇంట్లో వాళ్ళు బోరుకొడుతుంది అంటున్నారా.. అయితే ఈ రెసిపీ ఖచ్చితంగా మీ కోసమే, నేర్చుకుని ట్రై చేయండి.ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే గోబీ మంచూరియా ఎలా తయారుచేయాలో, కావాల్సిన పదార్దాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం

గోబీ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్దాలు

  • కాలిఫ్లవర్  – ఒకటి
  • ఉప్పు – తగినంత
  • పసుపు – పావు టీ స్పూన్
  • కారం - అర టీ స్పూన్
  • ధనియాల పొడి - అర టీ స్పూన్
  • మిరియాల పొడి – చిటికెడు
  • గరం మసాలా - పావు టీ స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
  • మైదా – అర కప్పు
  • కార్న్ ఫ్లోర్ – మూడు టీ స్పూన్స్
  • నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
  • పచ్చిమిర్చి- రెండు
  • ఉల్లిపాయ – ఒకటి
  • కరివేపాకు – రెండు రెమ్మలు
  • నిమ్మరసం - కొద్దిగా
  • సొయా సాస్ - ఒక టీ స్పూన్
  • చిల్లి సాస్ - అర టీస్పూన్
  • టమాటో సాస్ - ఒక టీ స్పూన్
  • కొత్తిమీర - రెండు రెమ్మలు

గోబీ మంచూరియా తయారుచేసే విధానం

ముందుగా కాలీఫ్లవర్ కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా పిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్‌లో వేయించటానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పేస్ట్ మిశ్రమంలో కాలిఫ్లవర్ ముక్కలను ఒక్కొక్కటిగా ముంచి వేసుకోవాలి.

కాలిఫ్లవర్ ముక్కలు ఎరుపు రంగులో వేగిన తరవాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్‌లో టేబుల్ స్పూన్ నూనె వేసి కాగాక సన్నగా తరిగిన ఉల్లి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తరవాత అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, మిరియాలపొడి, గరంమసాలా పొడి, ధనియాలపొడి, కొద్దిగా పసుపు, సరిపడా కారం, తగినంత ఉప్పు వేసి, పచ్చి వాసన పోయేలా మరి కొద్దిసేపు వేయించాలి.

వేగిన తరవాత సోయా సాస్, టమాటో సాస్, చిల్లి సాస్ వేసి మొత్తం కలిసేలా కలిపి, అందులో ముందుగా వేయించుకున్న కాలిఫ్లవర్ ముక్కలు వేసి ఐదు నిముషాలు కలుపుతూ వేయించుకోవాలి. అంతే చివర్లో కొత్తిమీర, నిమ్మరసం వేసుకుని సర్వ్ చేసుకోవటమే.

గోబీ మంచూరియాలో లభించే పోషకాలు

కాలిఫ్లవర్ మంచూరియా విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. గోబీ మంచూరియన్ లో విటమిన్ సి, విటమిన్ K, పొటాషియం, మాంగనీస్ మరియు విటమిన్ B6 వంటి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరచటానికి, ఎముకల ఆరోగ్యం, రక్తపోటుతో సహా వివిధ శారీరక విధులకు కీలకమైనవి మరియు శక్తి ఉత్పత్తి లో ఉపయోగపడతాయి.

గోబీ మంచూరియన్‌లో ప్రధాన పదార్ధమైన కాలీఫ్లవర్, డైటరీ ఫైబర్‌కి మంచి మూలం, ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది, గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాలీఫ్లవర్‌లో యాంటీఆక్సిడెంట్లు సంవృద్ధిగా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి, ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలను సమర్థవంతంగా తగ్గిస్తుంది.

గోబీ మంచూరియన్ తక్కువ కేలరీల వంటకం కానప్పటికీ, మితంగా వినియోగించి, తక్కువ నూనెతో తయారుచేసుకున్నప్పుడు ఆరోగ్యకరమైన బరువు నిర్వహణ ప్రణాళికలో భాగం కావచ్చు. ఫైబర్ మరియు ప్రోటీన్ కంటెంట్ మీకు పూర్తి మరియు సంతృప్తిని కలిగించడంలో సహాయపడుతుంది, మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది.

Post Comment