ఆనియన్ దోశ తయారీ విధానం : క్రిస్పీ ఉల్లి దోశ రెసిపీ
భారతీయ వంటకాలు

ఆనియన్ దోశ తయారీ విధానం : క్రిస్పీ ఉల్లి దోశ రెసిపీ

బ్రేక్ ఫాస్ట్ రెసిపీలలో ఆనియన్ దోశ ఎంత ఫేమస్ అనేది మనకు తెలిసిందే. ఆనియన్ దోశలో పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, జింక్, ఫాస్పరస్, ఐరన్ మరియు పిండి పదార్థాలు సంవృద్ధిగా ఉంటాయి. ఈ ఆర్టికల్ యందు ఎంచక్కా ఇంట్లోనే ఆనియన్ మరియు క్యారెట్ కాంబినేషన్లో దోశ తయారీకి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గూర్చి తెలుసుకుందాం.

ఆనియన్ దోశ తయారీకీ కావాల్సిన పదార్దాలు

  • మిన‌ప‌ప్పు – ఒక క‌ప్పు
  • బియ్యం – రెండు క‌ప్పులు
  • ఉప్పు – త‌గినంత‌
  • మెంతులు – అర టీ స్పూన్
  • అటుకులు – పావు క‌ప్పు
  • నీళ్లు – త‌గిన‌న్ని
  • చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు
  • చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3
  • క్యారెట్ తురుము – అర క‌ప్పు
  • అల్లం తురుము – ఒక టీ స్పూన్.
  • నూనె - సరిపడా

ఆనియన్ దోశ తయారీ విధానం

ముందుగా మిన‌ప‌ప్పు, బియ్యం, మెంతుల‌ను ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత వాటిలో త‌గిన‌న్ని నీళ్లు పోసి 6 నుండి 8 గంటల పాటు నాన‌బెట్టుకోవాలి లేదా ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. అదేవిధంగా అటుకుల‌ను పిండి ప‌ట్ట‌డానికి అర గంట ముందు నాన‌బెట్టుకోవాలి. ఇలా నాన‌బెట్టుకున్న త‌రువాత వీట‌న్నింటిని ఒక జార్ లో లేదా గ్రైండ‌ర్ లో వేసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి ఆరు గంట‌ల పాటు పిండిని పులియ‌బెట్టాలి. పిండి బాగా పులిసిన త‌రువాత త‌గినంత పిండిని ఒక గన్నెలోకి తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిజ్ లో ఉంచుకోవాలి.

ఇప్పుడు ఈ పిండిలో సరిపడా నీళ్లు, సరిపడా ఉప్పు వేసి కొంచెం పల్చగా క‌లుపుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పాన్ ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక త‌గినంత దోశ పిండిని తీసుకుని దోశ‌లా వేసుకోవాలి.

దోశ కొద్దిగా కాలిన త‌రువాత పైన గుండగా తరిగిన ఉల్లిపాయ ముక్క‌లు, పచ్చి మిర్చి తురుము, క్యారెట్ తురుము మిశ్ర‌మాన్ని దోశ అంతా వేసుకోవాలి. త‌రువాత పైన నూనెను వేసి దోశ‌ను ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. దోశ‌ను ఒక వైపు ఎర్ర‌గా అయ్యేలా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఆనియ‌న్ దోశ రెడీ అయినట్లే.

ఆనియన్ దోశ తయారీకి కొన్ని చిట్కాలు

దోశల కోసం పప్పులు, బియ్యం కనీసం ఆరు గంటలపాటు నన బెట్టుకోవాలి. పప్పుధాన్యాలు రుబ్బుకున్నాక పిండిని కూడా కనీసం ఆరు గంటలు పులియబెట్టాలి, రుబ్బు ఎంత బాగా పులియబెడితే దోశలు అంత క్రిస్పీగా మరియు టేస్టీగా వస్తాయి.

ఆనియన్ దోస మరింత రుచిగా కావాలనుకుంటే ఉల్లిపాయముక్కలతో  పాటు, క్యారెట్, ఆలూ వంటి వాటిని జోడించవచ్చు. దోశలు ఒక వైపు మాత్రమే ఎర్రగా అయ్యేవరకు బాగా కలుచుకోవాలి. దోశపై ఉల్లి, క్యారెట్ తురుము మధ్యలో కాకుండా మొత్తం పల్చగా సర్దుబాటు చేయాలి. దోశ కాలుతున్నప్పుడు చుట్టూ నూనె వేసుకోవాలి.

ఆనియన్ దోశలో లభించే పోషకవిలువలు

పిండి పదార్థాలు, కొవ్వు, ప్రోటీన్లు, విటమిన్లు, సోడియం మరియు పొటాషియం యొక్క మంచి మిశ్రమాన్ని కలిగి ఉండే దోశలు తేలికైనవి మరియు పోషకమైనవి . దోశలు అత్యంత పోషకమైనవి మాత్రమే కాదు, అవి గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో కూడా సహాయపడతాయి మరియు విటమిన్లు A మరియు C, ఇనుము మరియు కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.

ఉల్లిపాయలలో తగిన మొత్తంలో విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ B6 మరియు పొటాషియం ఉన్నాయి , ఇవి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అందులో ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా లభిస్తాయి. క్యాన్సర్ నిరోధక సమ్మేళనాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడండి. ఎముకల సాంద్రతను పెంచవచ్చు. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. జీర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చు.

Post Comment