రాగి అంబలి రెసిపీ తయారీ విధానం : రాగి జావ, పోషకాలు
భారతీయ వంటకాలు

రాగి అంబలి రెసిపీ తయారీ విధానం : రాగి జావ, పోషకాలు

ఈ ఆర్టికల్ యందు తక్కువ సమయంలో అధిక పోషక విలువలు, ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన రాగి పిండితో రాగి అంబలి తయారీ విధానం గూర్చి తెలుసుకుందాం.

రాగి అంబలి తయారీకి కావాల్సిన పదార్దాలు

  • రాగి పిండి – ఒక కప్పు
  • ఉల్లిపాయ – ఒక‌టి
  • ప‌చ్చి మిర్చి – రెండు
  • కొత్తిమీర – కొద్దిగా
  • పుదీనా – కొద్దిగా
  • పెరుగు – ఒక క‌ప్పు
  • నీళ్లు – నాలుగు కప్పులు
  • ఉప్పు – త‌గినంత‌

రాగి అంబలి తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని అందులో ఒక క‌ప్పు నీళ్ల‌ను పోసి ఉండ‌లు లేకుండా క‌లిపి మూత పెట్టుకుని 6 నుంచి 8 గంటలు పక్కన పెట్టి పులియ‌బెట్టాలి. తరవాత పులియ బెట్టిన రాగి పిండిని తీసుకుని మ‌రోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో అంబలి ఉడికించుకోటానికి సరిపడా నీళ్లు తీసుకుని అందులో రుచికి త‌గినంత ఉప్పును, త‌రిగిన ప‌చ్చి మిర్చిని వేసి నీళ్ల‌ను బాగా మ‌రిగించుకోవాలి.

నీళ్లు మ‌రిగిన త‌రువాత ముందుగా పులియ బెట్టుకున్న రాగి పిండిని మెళ్ళగా కలుపుతూ వేసుకోవాలి. అంబలి ఉడుకుతున్నప్పుడు కలుపుతూనే ఉండాలి లేదంటే చిక్కబడి అడుగు అంటుకుంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్ల్ లో కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత చిన్నగా త‌రిగిన ఉల్లిపాయ‌ల‌ను, పుదీనాను, కొత్తిమీర‌ను, పల్చని పెరుగును వేసి క‌లుపుకోవాలి. అంతే రుచిగా ఉండే రాగి అంబ‌లి త‌యార‌వుతుంది.

అంబలిని ఉల్లిపాయ‌, ప‌చ్చి మిర్చి తో క‌లిపి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.. వేసవి కాలంలో ఇలా రాగి అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల ఎండ వ‌ల్ల క‌లిగే నీర‌సం త‌గ్గి, శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. శ‌రీరంలో ఉండే వేడిని తగ్గించి చ‌లువ చేస్తుంది.

రాగి అంబలిలో పోషకాలు, ప్రయోజనాలు

రాగి అంబలి 5-8% ప్రోటీన్, 1-2% ఈథర్ ఎక్స్‌ట్రాక్టివ్‌లు, 65-75% కార్బోహైడ్రేట్లు, 15-20% డైటరీ ఫైబర్ మరియు 2.5-3.5% ఖనిజాలను కలిగి ఉంటుంది . రాగులలో అత్యధిక మొత్తంలో కాల్షియం (344mg%) మరియు పొటాషియం (408mg%) కలిగి ఉంటుంది.

మీ రోజువారీ ఆహారంలో రాగులను చేర్చుకోవడం సురక్షితమైనది మరియు ప్రయోజనకరమైనది . రాగి అనేది ఫైబర్, కాల్షియం మరియు ఐరన్‌తో కూడిన పోషకమైన తృణధాన్యం. దాని గ్లూటెన్ రహిత స్వభావం మరియు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ దీనిని సాధారణ వినియోగానికి అనువుగా చేస్తుంది, జీర్ణ ఆరోగ్యాన్ని మరియు మొత్తం శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది.

రాగుల్లో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, ఇది మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారికి మంచిది కాదు, ఎందుకంటే అదనపు ప్రోటీన్‌ను గ్రహించడం శరీరానికి కష్టమవుతుంది. రాగులు నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి, దాని అధిక వినియోగం తీవ్రమైన మలబద్ధకం సమస్యలను కలిగిస్తుంది.

మజ్జిగ ఉండటం వల్ల అంబలిని ఆదర్శవంతమైన వేసవి పానీయంగా చెప్పవచ్చు,అంబలి మంచి రిఫ్రెష్ ఇస్తుంది. రాగుల్లో సహజంగానే కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాల నిర్వహణకు కీలకం. మజ్జిగ జోడించడం వల్ల ఈ పానీయంలోని కాల్షియం కంటెంట్ మరింత పెరుగుతుంది.

Post Comment