తెలంగాణ స్పెషల్ బొమ్మిడాయిల చేపల పులుసు తయారీ విధానం
భారతీయ వంటకాలు

తెలంగాణ స్పెషల్ బొమ్మిడాయిల చేపల పులుసు తయారీ విధానం

చేపల్లోని రకాన్ని బట్టి, ఇగురు చేప, పులుసు, ఫ్రై, పచ్చడి ఇలా రకరకాలుగా చేపలతో వంటలు తయారు చేసుకోవచ్చు. చేపల కూర మంచి పోషకాలును కలిగి ఉంటుంది. ఇది ప్రొటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్ మరియు ఇతర పోషకాలకు మంచి మూలం.ఈ ఆర్టికల్ యందు చాలా ఈజీగా బొమ్మిడాయిల చేపల పులుసు తయారీ విధానం, కావాల్సిన పదార్దాలు గూర్చి తెలుసుకుందాం

బొమ్మిడాయిలు చేపలు పులుసు తయారీకి కావాల్సిన పదార్దాలు

  • బొమ్మిడాయిలు - అర కేజీ
  • ఉల్లిపాయలు - రెండు
  • టమాటాలు - రెండు
  • పచ్చి మిర్చి - 4
  • కారం – రెండు స్పూన్స్
  • పసుపు - అర స్పూన్
  • ఆవాలు - అర స్పూన్
  • ధనియాలు - అర స్పూన్
  • జీరా - అర స్పూన్
  • గరం మసాలా - అర టీ స్పూన్
  • పసుపు – అర టీ స్పూన్లు
  • ఉప్పు రుచికి సరిపడా
  • చింత పండు - రెండు బొట్టలు
  • లవంగాలు - నాలుగు
  • యాలకులు - రెండు
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • వేల్లుల్లి రెబ్బలు - ఆరు
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • నూనె - నాలుగు టేబుల్ స్పూన్స్

బొమ్మిడాయిలు చేపల పులుసు తయారీ విధానం

ముందుగా బొమ్మిడాయి చేపలు శుభ్రం చేసుకోవాలి. తర్వాత గిన్నెలో గడ్డ ఉప్పు, చేపలు వేసి జిగురు పోయేవరకూ కడుక్కోవాలి. అలాగే ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సిలో వేసి అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క చిన్న ముక్క, వేల్లుల్లి రెబ్బలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. టొమాటలను గుజ్జు చేసుకుని పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు దళసరిగా ఉన్న పాన్ తీసుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత జీరా, ఆవాలు, కరివేపాకు, నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి వేసుకుని వేయించాలి. తర్వాత అందులో ముందుగా రుబ్బుకున్న ఉల్లిపాయల పేస్ట్, టమాటో గుజ్జు వేసుకుని మూడు నిమిషాలు పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి. అనంతరం పసుపు, ధనియాల పొడి, సరిపడా ఉప్పు వేసి మరో రెండు నిముషాలు వేయించుకోవాలి.

రెండు నిమిషాల తరవాత కారం, గరం మసాలా వేసుకుని కొంచెం సేపు వేయించుకుని, కడిగి పెట్టుకున్న బొమ్మిడాయిల చేపలను వేసుకుని ఒక నిమిషం మెల్లగా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత అందులో చింతపండు గుజ్జులో గ్రేవీకి సరిపడా నీరు పోసుకుని చేపల మిశ్రమంలో వేసి లో - ఫ్లేమ్ లో మరిగించుకోవాలి.  కొంచెం మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకుని ఉప్పు, పులుపు చూసుకోవాలి. అంతే ఘుమఘమ లాడే బొమ్మిడాయిల చేపల పులుసు రెడీ అయినట్లే. పులుసు మరీ పల్చగా, మరీ చిక్కగా కాకుండా దించుకుంటే రుచికరమైన బొమ్మిడాయిలు పులుసు రెడీ.

బొమ్మిడాయిలు చేపల పులుసు లభించే పోషకవిలువలు

చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు డి మరియు బి2 (రిబోఫ్లావిన్) వంటి విటమిన్లు సంవృద్ధిగా ఉంటాయి . చేపలో కాల్షియం మరియు ఫాస్పరస్ మరియు ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు గుండె ఆరోగ్యం, మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి మరియు క్యాన్సర్ మరియు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

ఆరోగ్యకరమైన, పోషకాల సమతుల్య ఆహారంలో చేపలు ముఖ్యమైన భాగం. చేపలు ప్రోటీన్ మరియు విటమిన్లను సంవృద్ధిగా అందిస్తాయి మరియు గుండె-ఆరోగ్యనికి అవసరమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల యొక్క ప్రాధమిక ఆహార వనరు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సాల్మన్, క్యాట్ ఫిష్, టిలాపియా, ఎండ్రకాయలు మరియు స్కాలోప్స్ వంటి ఈ వర్గంలోని చేపలు మరియు షెల్ఫిష్‌లు వారానికి రెండు నుండి మూడు సార్లు లేదా వారానికి 8 నుండి 12 ఔన్సులు తినడం సురక్షితం.

Post Comment