టమాటో పచ్చడి రెసిపీ తయారీ విధానం : పోషకాలు, చిట్కాలు
భారతీయ వంటకాలు

టమాటో పచ్చడి రెసిపీ తయారీ విధానం : పోషకాలు, చిట్కాలు

ఈ ఆర్టికల్ ద్వారా టమాటాలతో టెంపరరీగా ఊరగాయ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు గురించి తెలుసుకుందాం ఈ రెసిపీని చాలా తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు. ఎండబెట్టక్కర లేదు. అప్పటికప్పుడు చేసుకొని వెంటనే లాగించేయొచ్చు. మీరు నేర్చుకుని ట్రై చేయండి.

టమాటో పచ్చడి తయారీకి కావాల్సిన పదార్ధాలు

  • టమాటో - అరకిలో
  • చింతపండు - ఆరు బొట్టలు
  • మినపప్పు - ఒక టీ స్పూన్
  • శనగపప్పు - ఒక టీ స్పూన్
  • మెంతులు - రెండు టీ స్పూన్స్
  • ఆవాలు - రెండు టీ స్పూన్స్
  • జీలకర్ర - ఒక టీ స్పూన్
  • ఇంగువ - చిటికెడు
  • ఎండుమిర్చి - నాలుగు
  • వెల్లుల్లి - ఒకటి
  • కారం - నాలుగు టీ స్పూన్స్ ( సరిపడా)
  • పసుపు - ఒక టీ స్పూన్
  • నూనె - సరిపడా
  • ఉప్పు - సరిపడా
  • నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
  • కరివేపాకు - రెండు రెమ్మలు

టమాటో పచ్చడి తయారీ విధానం

ముందుగా టమాటాలు శుభ్రంగా కడగాలి, కడిగిన తరవాత టమాటాలు తడి లేకుండా తుడిచుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో టమాటో ముక్కలు, చింతపండు వేసి మీడియం ఫ్లేమ్ లో మెత్తగా అయ్యేలా కలుపుతూ బాగా మగ్గనివ్వాలి. టమాటాలు మెత్తగా అయ్యాక టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలా కలుపుకుని పక్కన బెట్టి చల్లార్చుకోవాలి.

ఇప్పుడు పాన్‌లో ఒక టీ స్పూన్ ఆవాలు, మెంతులు వేసి లో- ఫ్లేమ్ లో వేయించి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇలా పొడిచేసుకున్న మిశ్రమాన్ని ముందుగా ఉడకబెట్టిన టమాటా మిశ్రమంలో వేసి, సరిపడా కారం, సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీలో మెత్తగా పేస్టులాగా రుబ్బుకోవాలి.

ఇప్పుడు పోపుకోసం పాన్‌లో సరిపడా నూనె, నెయ్యి వేసి, నూనె వేడయ్యాక టీ స్పూన్ జీరా, శనగపప్పు, మినపప్పు, మిగిలిన ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు , అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసి పోపుని బాగా వేయించి మిక్సీ పట్టిన టమాటా మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతే యమ్మీ యమ్మీ టమాటో పచ్చడి రెడీ అయినట్లే. నూనె చాలకపోతే కొంచెం నూనెను ఇంగువ తో కాచి, చల్లార్చి కలుపుకోవాలి.

టమాటో పచ్చడి తయారీకి కొన్ని చిట్కాలు

టమాటో పచ్చడి పండిన, ఎరుపు టమోటాలు ఉపయోగించండి. టొమాటోలు ఎంత పండితే ఊరగాయ అంత తియ్యగా, రుచిగా ఉంటుంది. మీరు చింతపండు పేస్ట్ ఉపయోగిస్తుంటే, అది చిక్కగా ఉండేలా చూసుకోండి. టొమాటోలను అతిగా ఉడికించవద్దు. వాటిని ఎక్కువగా ఉడకబెట్టడం వల్ల ఊరగాయ చప్పగా మరియు మెత్తగా ఉంటుంది.

టమాటో ఊరగాయలలో ఉపయోగించే కొన్ని సాధారణ మసాలా దినుసులు ఆవాలు, మెంతులు, పసుపు పొడి, కారం పొడి మరియు ధనియాల పొడి. మీరు మీ ఊరగాయను ఎంత స్పైసిగా ఇష్టపడుతున్నారో బట్టి, మీరు రుచికి అనుగుణంగా మసాలాల మొత్తాన్ని సర్దుబాటు చేయవచ్చు. ఊరగాయను శుభ్రమైన, గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి. ఇది తాజాగా ఉంచడానికి మరియు పాడైపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.

టమాటో పచ్చడిలో పోషక విలువలు

టమాటో పచ్చడిలో విటమిన్- సి అధికంగా ఉంటుంది, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచటానికి మరియు చర్మ ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది.

టమాటో పచ్చడిలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించటానికి, మెగ్నీషియం కండరాల పనితీరుకు మరియు ఇందులో ఐరన్ రక్త హీనతను నివారించటానికి ఉపయోగపడతాయి.

టమాటో పచ్చడిలో లైకోపీన్, బీటా కెరోటిన్, విటమిన్ సి, వంటి యాంటిఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి సహాయపడతాయి.

Post Comment