బొంబాయి చట్నీ తయారీ విధానం : బేసన్ చట్నీ రెసిపీ
భారతీయ వంటకాలు

బొంబాయి చట్నీ తయారీ విధానం : బేసన్ చట్నీ రెసిపీ

బ్రేక్ ఫాస్ట్ రెసిపీస్ లో చట్నీలు ఎంత ఫేమస్ అనేది మనకు తెలుసు. ముఖ్యంగా టిఫిన్స్ ఇడ్లీ, దోస, మరియు వడ వంటి వాటికి చట్నీలు తప్పని సరిగా ఉండాలి. ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే బొంబాయి చట్నీ ఎలా తయారు చేయాలి, చట్నీ తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో తెలుసుకుందాం.

బొంబాయి చట్నీ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • శెనగపిండి - అరకప్పు
  • ఉల్లిపాయ - ఒకటి
  • పచ్చి మిర్చి - రెండు
  • ఆవాలు - అర స్పూను
  • జీలకర్ర - అర స్పూను
  • కరివేపాకు - గుప్పెడు
  • పసుపు - పావు టీస్పూను
  • కొత్తిమీర తరుగు - ఒక స్పూను
  • మినపప్పు - అర స్పూను
  • శెనగపప్పు - అర స్పూను
  • నూనె - ఒక స్పూను
  • ఉప్పు - రుచికి తగినంత

బొంబాయి చట్నీ తయారీ విధానం

ఒక గిన్నెలో అరకప్పు శెనగపిండి తీసుకుని అందులో ఒకటిన్నర కప్పు లేదా రెండుకప్పులు  నీళ్లు పోసి ఉండల్లేకుండా బాగా కలపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శెనగపప్పు వేసి వేయించాలి. అవి వేగాక ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు వేసి బాగా వేయించాలి.

పోపు వేగాక అందులో ముందుగా కలిపి పెట్టుకున్న శెగనపిండి మిశ్రమాన్ని కూడా వేసి గరిటెతో బాగా కలపాలి. మూత పెట్టకుండా ప్రతి నిమిషంకోసారి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు తగినంత ఉప్పును వేసి కలుపుకోవాలి, తరచూ గరిటెతో కలపకపోతే అడుగున అంటుకుని ఉండలు కట్టేసే అవకాశం ఉంది కాబట్టి దించే ముందు వరకు కలుపుతూనే ఉండాలి.

మరీ పలుచగా కాకుండా, అలాగని చిక్కగా కాకుండా మధ్యస్థంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, పైన కొత్తమీర చల్లుకుంటే సరిపోతుంది. కేవలం పదినిమిషాలలో ఈ చట్నీ రెడీ అయిపోతుంది. టేస్టు కూడా అదిరిపోతుంది. బొంబాయి చట్నీ ఇడ్లి, దోస, ఆవిరికుడుము, వడ వంటి కాంబినేషన్లో చాలా బాగుంటుంది.

బొంబాయి చట్నీలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

బొంబాయి చట్నీలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, విటమిన్ B6 వంటి పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి. శెనగపిండి ప్రోటీన్‌కు మంచి మూలం, ఇది కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి అవసరం. శెనగపిండి మరియు ఉల్లిపాయలు రెండూ ఫైబర్ యొక్క మంచి మూలాలు, ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మరియు క్రమబద్ధతను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

బొంబాయి చట్నీ విటమిన్ సి మరియు కె లకు మంచి మూలం, ఇవి వరుసగా రోగనిరోధక పనితీరు మరియు ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనవి . బొంబాయి చట్నీలోని విటమిన్లు మరియు ఖనిజాలు ఇన్ఫెక్షన్ నుండి రక్షించడానికి సహాయపడతాయి. బొంబాయి చట్నీ ఇనుము, మెగ్నీషియం మరియు మాంగనీస్ యొక్క మంచి మూలం , ఇవి వివిధ శారీరక విధులకు ముఖ్యమైనవి.

Post Comment