టేస్టీ క్యారెట్ పచ్చడి తయారీ విధానం : పోషకాలు, ప్రయోజనాలు
భారతీయ వంటకాలు

టేస్టీ క్యారెట్ పచ్చడి తయారీ విధానం : పోషకాలు, ప్రయోజనాలు

రోజూ ఉదయం చేసుకునే బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీలు ఎంత అవసరం అనేది మనకు తెలుసు. ముఖ్యంగా టిఫిన్స్ ఇడ్లీ, దోస,పూరి మరియు వడ వంటి వాటికి చట్నీలు తప్పని సరిగా ఉండాలి. ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే క్యారెట్ చట్నీ ఎలా తయారు చేయాలి, చట్నీ తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ కొత్త రెసిపీని మీరు కూడా ట్రై చేయండి.

క్యారెట్ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్దాలు

  • క్యారెట్ - నాలుగు
  • ట‌మాటా - ఒకటి
  • ప‌చ్చిమిర్చి - మూడు
  • ఉప్పు - త‌గినంత‌
  • నూనె - 2 టీ స్పూన్స్
  • ప‌సుపు - చిటికెడు
  • ఎండుమిర్చి - రెండు
  • ధ‌నియాలు - అర స్పూన్
  • జీల‌క‌ర్ర - అర టీ స్పూన్
  • వెల్లుల్లి రెబ్బ‌లు - నాలుగు
  • చింత‌పండు - ఒక బొట్ట
  • నూనె - 2 టీ స్పూన్స్
  • ఆవాలు - అర స్పూన్
  • శ‌న‌గ‌ప‌ప్పు - ఒక టీ స్పూన్
  • మిన‌ప‌ప్పు - ఒక టీ స్పూన్
  • క‌రివేపాకు - ఒక రెమ్మ‌

క్యారెట్ పచ్చడి తయారీ విధానం

ముందుగా క్యారెట్స్ శుభ్రంగా కడిగి చిన్నగా తరిగి పెట్టుకోవాలి. తరవాత స్టవ్ ఆన్ చేసి క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక శెనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరవాత క్యారెట్ ముక్క‌లు, ప‌సుపు వేసి క‌లుపుతూ వేయించాలి. క్యారెట్ ముక్క‌లు కొద్దిగా వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు అందులో ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు, చింత‌పండు వేసి క్యారెట్ ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి.

ఇలా వేగిన త‌రువాత అందులో ట‌మాట ముక్క‌లు కూడా వేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఈ ట‌మాటముక్కలు మెత్తగా అయ్యాక స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్రమాన్ని చ‌ల్లారే వ‌ర‌కు పక్కనబెట్టుకోవాలి. చల్లారాక ఒక జార్ లోకి తీసుకుని, త‌రువాత త‌గినంత ఉప్పు వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు పోపు కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు బాగా వేయించుకోవాలి. తాళింపు బాగా వేగిన తరవాత దీనిని ముందుగా త‌యారు చేసుకున్న ప‌చ్చ‌డిలో వేసి క‌లుపుకోవాలి. అంతే రుచిగా ఉండే క్యారెట్ ట‌మాట ప‌చ్చ‌డి రెడీ అయినట్లే. దీనిని అన్నం, దోశ‌, ఇడ్లీ, ఊత‌ప్పం వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

క్యారెట్ పచ్చడిలో లభించే పోషకాలు

క్యారెట్లు బీటా కెరోటిన్ యొక్క అద్భుతమైన మూలం, ఇది శరీరంలో విటమిన్ ఎగా మార్చబడుతుంది. విటమిన్ ఎ దృష్టి, రోగనిరోధక పనితీరు మరియు కణాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. క్యారెట్లు డైటరీ ఫైబర్ యొక్క మంచి మూలం, ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆవాలు విటమిన్ సి యొక్క మంచి మూలం, ఇది యాంటీఆక్సిడెంట్ కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆవాలులో కూడా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది, ఐరన్ శరీరం అంతటా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి అవసరం.

క్యారెట్ పచ్చడిలోని విటమిన్ సి మరియు ఇతర యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ మరియు గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దోహదపడే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. క్యారెట్ పచ్చడి పొటాషియం, మెగ్నీషియం మరియు ఐరన్ వంటి ఖనిజాలకు కూడా మంచి మూలం.

Post Comment