వెజిటబుల్ దమ్ బిర్యానీ తయారీ విధానం : హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ
భారతీయ వంటకాలు

వెజిటబుల్ దమ్ బిర్యానీ తయారీ విధానం : హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ

మీరు కూడా బిర్యానీ లవర్ అయితే మీ దినచర్యను ఈ వెజ్ బిర్యానీతో స్టార్ట్ చేసేయండి. ఆలస్యం చేయకుండా ఈ ఆర్టికల్ ద్వారా చక్కని వెజ్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంచక్కా మీరు నేర్చుకుని, ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వండి.

వెజ్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్ధాలు

  • రైస్ - నాలుగు కప్పులు
  • క్యారెట్ - ఒకటి
  • బీన్స్ - 100 గ్రా..
  • గ్రీన్ పీస్ - ఆఫ్ కప్పు
  • బంగాళ దుంప - ఒకటి
  • మిల్లి మేకర్స్ - పిడికెడు
  • బిర్యానీ ఆకులు - రెండు
  • ఉల్లిపాయలు - మూడు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్
  • లవంగాలు - నాలుగు
  • యాలకులు- నాలుగు
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • షాజీరా - 1/2 స్పూన్
  • పచ్చి మిర్చి - నాలుగు
  • నూనె - రెండు టేబుల్ స్పూన్స్
  • నెయ్యి - రెండు స్పూన్స్
  • పుదీనా, కొత్తిమీర - ఆఫ్ కప్పు
  • పెరుగు - ఒక కప్పు
  • గరంమసాలా - ఒక స్పూన్
  • కారం పొడి - సరిపడా
  • ఉప్పు  - సరిపడా
  • నిమ్మకాయ - ఒకటి

వెజ్ దమ్ బిర్యానీ తయారీ విధానం

ముందుగా రైస్ కడిగి పదిహేను నిమిషాలు నాననివ్వాలి. రైస్ నానబెట్టుకున్న తర్వాత, ఒక గిన్నెలో రైస్ ఉడకబెట్టడానికి సరిపడా నీళ్లు ( 9 కప్పులు ) తీసుకొని అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకులు కొద్దిగా నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు వేసి మరిగించాలి.

నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేయాలి. మరోపక్క స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే కళాయిలో నునె వేసి, కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. (వేయించిన ఉల్లిపాయ ముక్కలలో సగం తీసి పక్కన పెట్టుకోవాలి) ఇప్పుడు ఇందులో నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి , పుదీనా, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, సరిపడా కారం వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.

అలా వేగుతున్న మిశ్రమలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు వేసి కలుపుకుని మూత పెట్టి ఐదు నిముషాలు మగ్గనివ్వాలి. ముక్కలు మగ్గిన తరవాత అందులో పెరుగు, నిమ్మరసం వేసి కలపాలి.

ఇప్పుడు బియ్యం ముప్పావు వంతు ఉడకగానే జల్లెట్లో వేసి నీరంతా ఓడ్చాలి. నీరంతా వడపోశాక అన్నం, కూరగాయల మిశ్రమం పొరలు పొరలుగా వేసి, పైన కొద్ది కొద్దిగా నెయ్యి కూడా వేసి మూతపెట్టాలి. మూత పెట్టిన తరువాత దానిపైన బరువు ఏదైనా పెట్టి చిన్న మంటమీద ఓ పదినిమిషాల పాటూ ఆవిరికి మగ్గనివ్వాలి.

చివరిగా పైన కొత్తిమీర, ముందుగా వేయించి తీసిన ఉల్లిపాయ తురుమును వేసుకుంటే సరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీగా వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయినట్లే.

వెజ్ దమ్ బిర్యానీ తయారీకి కొన్ని చిట్కాలు

బిర్యానీ కోసం సన్న బియ్యాన్ని ( బాస్మతి ) ఉపయోగించండి. బియ్యం ముందు ఓ పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి, ఇలా చేయటం వలన అన్నం ముద్దలా కాకుండా ఉడుకుతుంది. ఉల్లిపాయలు ఎంత బాగా వేయిస్తే బిర్యానీ అంత టేస్టీగా వస్తుంది.

కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, చిన్నగా కట్ చేయటం వలన తొందరగా ఉడుకుతాయి, అలాగే చూడటానికి కూడా బాగుంటుంది. మసాలా దినుసులు కొంచెం దోరగా వేయించండి. ఇలా వేయటంవలన బిర్యానీకి మంచి వాసన వస్తుంది. బిర్యానీ ఉడికిన తరువాత నెయ్యి వేస్తే మంచి రుచి వస్తుంది.

వెజ్ దమ్ బిర్యానీలో పోషక విలువలు

బియ్యంలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందించటంలో ఉపయోగపడతాయి. కూరగాయలలో ప్రోటీన్స్ సంవృద్ధిగా లభిస్తాయి, కణాలు పెరుగుదల, మరమ్మతుకు సహాయపడతాయి.

విటమిన్స్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని సరిగ్గా పని చేయడంలో విటమిన్లు వివిధ పనులను కలిగి ఉంటాయి. కొన్ని విటమిన్లు ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో మరియు మీ నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో మీకు సహాయపడతాయి, మరికొన్ని మీ శరీరం ఆహారం నుండి శక్తిని పొందడంలో లేదా మీ రక్తం సరిగ్గా గడ్డకట్టడంలో సహాయపడతాయి .

అలాగే ఇందులో ఉండే  ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చి , మకబద్దకాన్ని నివారిస్తుంది. వెజ్ బిర్యానీలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్ వంటి ఖనిజ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

Post Comment