ఉసిరికాయ పప్పు తయారీ విధానం : Usirikaya Pappu Recipe
భారతీయ వంటకాలు

ఉసిరికాయ పప్పు తయారీ విధానం : Usirikaya Pappu Recipe

ఉసిరికాయ పప్పు ఆరోగ్యకరమైన మరియు పోషకాకరమైన వంటకం. ఉసిరిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఉసిరికాయ పప్పుని ఎలా తయారు చేయాలి, కావాల్సిన పదార్దాలు ఏమిటి అని ఈ ఆర్టికల్ యందు తెలుసుకుందాం.

ఉసిరికాయ పప్పు తయారీకి కావలిసిన పదార్ధాలు

  • కంది పప్పు - ఒక కప్పు
  • టమాటాలు - నాలుగు
  • ఉల్లిగడ్డ - ఒకటి
  • ఉసిరికాయలు - పది
  • కారం - ఒక టీ స్పూన్
  • పసుపు - 1/4 టీ స్పూన్
  • శనగ పప్పు -  ఒక టీ స్పూన్
  • మినపప్పు - ఒక టీ స్పూన్
  • ఆవాలు - 1/2 టీ స్పూన్
  • జీలకర్ర - 1/2 టీ స్పూన్
  • వెల్లుల్లిపాయ - ఒకటి
  • ఎండు మిర్చి - మూడు
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • ఉప్పు - తగినంత
  • నూనె - సరిపడా
  • నెయ్యి - కొద్దిగా
  • కొత్తిమీర - రెండు రెమ్మలు.

ఉసిరికాయ పప్పు తయారు చేసే విధానం

ముందుగా తాజా ఉసిరి కాయలు తీసుకుని శుభ్రంగా కడిగి, గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉసిరికాయలు కట్ చేసుకున్నాక వాటిని  కుక్కర్ లో వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించాలి, ఇప్పుడు అందులో కంది పప్పు, తరిగిన టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, టేబుల్ స్పూన్ నూనె, మూడు కప్పుల నీళ్లు పోసి, మూతపెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి.

మూడు విజిల్స్ వచ్చి పప్పు ఉడికిన తరవాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కవ్వంతో బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కళాయి తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి, నూనె వేసి కాగాక, అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి పాయలు, కరివేపాకు వేసి తాళింపు వేయించాలి. తాళింపు వేగాక మిశ్రమాన్ని పప్పులో వేసి మొత్తం కలిసేలా కలుపుకుని, పైన కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ ఉసిరికాయ పప్పు రెడీ అయినట్లే. ఉసిరికాయ పప్పును వేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.

ఉసిరికాయ పప్పు తయారీకి కొన్ని చిట్కాలు

ఉసిరి కాయలు పిక్కలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలు ముందుగా వేయించి తర్వాత పప్పు వేసి ఉడికించాలి. లేదంటే పులుపు తగిలి పప్పు సరిగ్గా ఉడకదు. ఉసిరి వేయించి వేస్తే పప్పు రుచి కూడా బాగుంటుంది.

ఉసిరికాయ పప్పుకు మసాలాలు ఎక్కువుగా వేయకూడదు. ఎందుకంటే ఉసిరికాయలు పుల్లగా ఉండటం వల్ల మసాలాలు ఎక్కువ వేస్తే పప్పుకు రుచి ఉండదు. ఉసిరికాయ పప్పులో కొంచెం నెయ్యి వేసి కలిపితే రుచి మరింత పెరుగుతుంది.

ఉసిరికాయ పప్పులో పోషక విలువలు

ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్- సి రోగనిరోధక శక్తిని పెంచటమే కాకుండా చర్మ ఆరోగ్యం మరియు కాన్సర్ ను  నివారిస్తుంది. విటమిన్- ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉసిరిలో ఐరన్ సంవృద్ధిగా ఉండి రక్త హీనతనను నివారిస్తుంది.

ఉసిరికాయపప్పులో కాల్షియం పుష్కలంగా ఉండి ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరియు రక్తపోటును నియంత్రిస్తుంది. ఉసిరిపప్పులో ఫైబర్ సంవృద్ధిగా ఉండి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అలాగే చక్కర స్థాయిలను నియంత్రించి, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇందులో యాంటియోక్సిడెంట్స్ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది మరియు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలను తగ్గిస్తుంది.

Post Comment