కాలిఫ్లవర్ కర్రీ తయారీ విధానం : కాలిఫ్లవర్ మాసాల కర్రీ
భారతీయ వంటకాలు

కాలిఫ్లవర్ కర్రీ తయారీ విధానం : కాలిఫ్లవర్ మాసాల కర్రీ

ఈ ఆర్టికల్ యందు టేస్టీ టేస్టీగా కాలిఫ్లవర్ మరియు బఠానీ కాంబినేషన్లో చేసే కాలిఫ్లవర్ మసాలా కర్రీ రెసిపీ తయారీ విధానం, కర్రీ తయారీకి కావాల్సిన పదర్ధాలు గూర్చి తెలుసుకుందాం. మీరు నేర్చుకుని ట్రై చేసి రుచి చూడండి.

కాలిఫ్లవర్ కర్రీకి కావాల్సిన పదార్దాలు

  • క్యాలీప్ల‌వ‌ర్ – ఒకటి
  • నూనె – రెండు లేదా టేబుల్ స్పూన్స్
  • యాల‌కులు – రెండు
  • ల‌వంగాలు – ఒకటి
  • దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌
  • జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్
  • క‌రివేపాకు – ఒక రెమ్మ‌
  • ప‌చ్చి బ‌ఠాణీ – పిడికెడు
  • ఉల్లిపాయ‌లు – రెండు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్
  • ట‌మాటాలు – రెండు
  • ప‌సుపు – పావు టీ స్పూన్
  • కారం – ఒక టీ స్పూన్
  • ఉప్పు – త‌గినంత‌
  • ధ‌నియాల పొడి – అర టీ స్పూన్
  • నీళ్లు – ఒక గ్లాస్
  • గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్
  • కొత్తిమీర – కొద్దిగా.
  • కరివేపాకు - కొద్దిగా

కాలిఫ్లవర్ కర్రీ తయారీ విధానం

ముందుగా కాలిఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. త‌రువాత వీటిని శుభ్రంగా క‌డిగి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదేవిధంగా టమాటాలు, ఉల్లిపాయలు విడివిడిగా పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక అందులో కాలిఫ్లవర్ ముక్క‌లు వేసి క‌లుపుతూ రంగు మారే వ‌ర‌కు బాగా వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి.

త‌రువాత అదే క‌ళాయిలో మ‌రికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క,జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు వేసి ఒక నిమిషం వేయించాలి. త‌రువాత అందులో ప‌చ్చి బ‌ఠాణీని వేసి రెండు నిముషాలు వేయించుకోవాలి. బఠాణి వేగిన త‌రువాత, ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ‌ల‌ పేస్ట్ వేసి మరో రెండు నిముషాలు వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగిన త‌రువాత అందులో అల్లం పేస్ట్, టమాటా పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు ఐదు నిముషాలు లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి.

త‌రువాత ఇందులో ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, సరిపడా ఉప్పు వేసి, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు వేసి కలుపుకోవాలి.  త‌రువాత సరిపడా నీళ్లు పోసి (ఒక గ్లాసుడు) మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. చివరిగా గ‌రం మ‌సాలా, కొత్తిమీర వేసి ఓ పది నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ  కాలీప్ల‌వ‌ర్ మ‌సాలా కూర త‌యార‌వుతుంది. అన్నం, చ‌పాతీ, పూరీ వంటి వాటితో ఈ కూర‌ను క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే కాలీప్ల‌వ‌ర్ కూర‌ల కంటే ఈ విధంగా చేసిన క్యాలీప్ల‌వ‌ర్ కూర మ‌రింత రుచిగా ఉంటుంది.

కాలిఫ్లవర్ కూరలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

కాలీఫ్లవర్ ఒక క్రూసిఫరస్ వెజిటేబుల్, అంటే ఇది గ్లూకోసినోలేట్స్ యొక్క మంచి మూలం. గ్లూకోసినోలేట్‌లు శరీరంలో విచ్ఛిన్నమై ఐసోథియోసైనేట్‌లను ఏర్పరుస్తాయి, ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీకాన్సర్ లక్షణాలను కలిగి ఉన్నాయని తేలింది. కాలీఫ్లవర్ లో విటమిన్ C, K మరియు B6 పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ సి అనేది యాంటీఆక్సిడెంట్, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టడానికి విటమిన్ K ముఖ్యమైనది మరియు మెదడు పనితీరుకు విటమిన్ B6 ముఖ్యమైనది.

కాలీఫ్లవర్ లో పొటాషియం, ఫాస్పరస్ మరియు మెగ్నీషియంతో సహా ఖనిజాలు సంవృద్ధిగా లభిస్తాయి. కండరాల పనితీరుకు పొటాషియం, ఎముకల ఆరోగ్యానికి భాస్వరం, శక్తి ఉత్పత్తికి మెగ్నీషియం ముఖ్యమైనవి. కాలీఫ్లవర్‌లోని యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

Post Comment